Sep 23,2023 13:04

ప్రజాశక్తి- నందిగామ : విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని కోరుతూ భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నందిగామ డివిజన్ కమిటీ ఆద్వర్యంలో స్థానిక కాకాని వెంకటరత్నం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల గురించి చర్చ జరపాలని కోరారు. నాలుగున్నరేళ్ళ వైసిపి హాయాంలో విద్యారంగంలో సమస్యలు తిష్ఠ వేసాయని ఆరోపించారు.పేదల పక్షాన ఉంటానంటూ ఆ పేద విద్యార్థులు చదువుకునే విద్యాసంస్థలు నేడు సమస్యల నిలయాలుగా ఉన్నాయని విమర్శించారు.పధకాల పేరుతో రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్న పధకాల అమలు కూడా కోతలు విధిస్తున్నారని అన్నారు.చివరికి ఇంటర్ చదువుకునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. పేద విద్యార్థిలకు బాసటగా ఉండే సంక్షేమ వసతి గృహాలు స్వంత భవనాలు లేక ఉన్న ప్రభుత్వ భవనాలలో సరైన వసతులు లేక అవస్థలకు గురైతున్నారని వాపోయారు. హాస్టళ్ళకు కూడా నాడు నేడు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాని ఊసెత్తలేదని అన్నారు.సన్న బియ్యం మాటే మరిచిపోవడం గర్హనీయం.ధరలు విపరీతంగా పెరిగిన నేపధ్యంలో హాస్టళ్ళకు మెస్ బిల్లులు పెంచాలని ఈ నాలుగేళ్ళలో 150రూ.పెంచి చేతులు దులుపుకుందని అన్నారు. వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను రూ.3వేలకు పెంచాలని, పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేసారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకానికి 20రూ.పెంచాలని కోరారు .ఉన్నత విద్యలో జిఓ 77 తీసుకొచ్చి ఎయిడెడ్, ప్రయివేటులో చదువకునే పిజి విద్యార్ధులకు పధకాలు అమలు చేయకుండా ఉన్నత విద్యను దూరం చేసారని తెలిపారు. కేంద్రంలో మోడి ప్రభుత్వం తీసుకొని వచ్చిన జాతీయ విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేస్తూ తరగతుల విలీనం, నాలుగేళ్ళ డిగ్రీ లాంటి తిరోగమన విధానలను అమలుకు పూనుకుంటున్నారు. విలీనంతో ఫౌండేషన్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గి మూసివేతకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నాలుగేళ్ళ డిగ్రీ వలన విద్యార్థులకు ఒరిగిందేమిలేదని తిరిగి పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేసారు.డిగ్రీ,పిజి కామన్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఈ సమస్యలు అనేక సందర్భాలలో ప్రభుత్వానికి విన్నవించుకున్న మొద్దునిద్ర పోతుందని ప్రభుత్వ మొద్దునిద్ర వీడేందుకు 26న జరిగే చలో కలెక్టరేట్ కు విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె.వి.ఆర్ కాలేజీ నాయకులు వెంకటేష్, శ్యామ్,నవీన్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.