Sep 26,2020 08:30

తనకు పాతిక మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఇస్తే ప్రత్యేక హోదా తీసుకు వస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి...కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ను కలుసుకున్న సందర్భంలో ప్రత్యేక హోదా అడగలేదు. ఉభయ పార్లమెంటు సభల్లో వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు సైతం ఈ ప్రస్తావన తీసుకు రాలేదు. తుదకు తెలుగుదేశం సభ్యులు కూడా ప్రస్తావించలేదు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి లు ప్రత్యేక హోదాను బలిపీఠం ఎక్కించాయి. ఒకరిపై మరొకరు పైచేయి సంపాదించేందుకు ఒకరికి అమరావతి కుంభకోణాలు ముఖ్యమైతే...మరొకరికి కమలనాథుల మెప్పు పొందడమే ఎజెండా అయింది. ఎ.పి దశ, దిశ మార్పుకు ఉపకరించే ప్రత్యేక హోదా సూచన ప్రాయంగా కూడా ప్రస్తావనకు రాకుండానే పార్లమెంటు సమావేశాలు ముగిశాయి.
రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా నిలదీసే పరిస్థితి నుండి తప్పించుకొనేందుకు ప్రజల దృష్టి మరల్చేందుకు బిజెపి నేతలు మరో ఎత్తుగడ చేపట్టారు. రాష్ట్ర బిజెపికి కొత్త నాయకత్వం తీసుకు వచ్చి గుళ్ళు, గోపురాలపై దాడులను తెర మీదకు తెచ్చి భావోద్వేగాలను పురికొల్పుతున్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ కు భిక్ష కాదు. హక్కు మాత్రమే. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చలో ప్రత్యేక హోదా అంశాన్ని బిజెపి నేతలే లేవనెత్తారు. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో హామీ ఇచ్చిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి ఆఖరుగా ప్లానింగ్‌ కమిషన్‌కు కూడా పంపారు. మరో విశేషమేమంటే ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అయిదేళ్లు కాకుండా పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో నొక్కి చెప్పారు. పైగా 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ తిరుపతి నుండి విశాఖ వరకు జరిగిన బహిరంగ సభల్లో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అయితే నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ప్రత్యేక హోదా నానపెడుతూ వచ్చి డిసెంబర్‌లో ప్లానింగ్‌ కమిషన్‌ ను రద్దు చేశారు. ఈలోపు ఒకటి రెండు అంశాలపై బిజెపి నేతలు సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు.
ఒకటి-ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన చట్టంలో లేదని. రెండు-ప్రత్యేక హోదా వేరు, పారిశ్రామిక రాయితీలు వేరని మభ్యపెట్టే ప్రకటనలు చేశారు. ఇది పూర్తిగా తప్పు దారి పట్టించడమే. ఇదిలా వుండగా ప్రత్యేక హోదా వేరు. రాష్ట్ర విభజన చట్టం వేరు. విభజన చట్టం మేరకు అందవలసిన రాయితీలు వేరు. అప్పట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతా కలగాపులగం చేశాయి. వాస్తవంలో అప్పటి వరకు ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ చట్టం ద్వారా అమలు చేయలేదు. 1969లో ఇది తెర మీదకు వచ్చింది. 5వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అయిదు అంశాల్లో వెనుక బడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమలు చేశారు. అందులో అయిదవ అంశమైన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మనుగడ సాగించలేని విధంగా వుండటం (నాన్‌ వయబుల్‌ నేచర్‌) దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా అంగీకరించడం జరిగింది. ప్లానింగ్‌ కమిషన్‌ నివేదిక మేరకు జాతీయాభివృద్ధి మండలి ఆమోదంతో ప్రత్యేక హోదా అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. కాని ఆంధ్రప్రదేశ్‌ వచ్చేసరికి విభజన చట్టంలో లేదని చెప్పడం పచ్చి మోసమనని రాష్ట్ర ప్రజలు భావించారు.
అప్పట్లో తీవ్ర తర్జనభర్జనలు రాష్ట్రంలో నిరసన ఆందోళనల మధ్య 2016లో ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. చంద్రబాబు నాయుడు కళ్లకద్దుకోవడం మనకు తెలుసు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని ఆనాడు వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేకించింది.
అయితే అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి మరో చిక్కు ముడి తెర మీదకు తెచ్చారు. ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదనేది ఆనాటి కేంద్రం వాదన. ఇది కూడా శుద్ధ అబద్ధం. అప్పటికే ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాల్లో నెలకొల్పబడిన పరిశ్రమలకు ఎక్సైజ్‌ సుంకం ఆదాయపు పన్ను వంద శాతం మినహాయింపు-పరిశ్రమల యంత్ర సామాగ్రిపై గరిష్ట పరిమితి లేకుండా ముప్పై శాతం మూలధనం పెట్టుబడి రాయితీ-రవాణా సబ్సిడీ కింద బయట ప్రాంతాల నుండి వచ్చే సరుకుల రవాణాపై 90 శాతం అంతర్గత రవాణా కింద 50 రాయితీ-పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుండి గరిష్టంగా పదేళ్ల పాటు వర్కింగ్‌ క్యాపిటల్‌ పై మూడు శాతం వడ్డీ రాయితీ ఇవ్వబడింది.
అయితే 14 ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు లోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాకు నిధులంటూ లేవని 2017లో కేంద్రం ప్రభుత్వం మంత్రి వర్గ ఆమోదంతో ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీల కోసం రూ.27143 కోట్లు మంజూరు చేసింది. 2017 జూన్‌ ఒకటవ తేదీ నుంచి 2027 వరకు పదేళ్ల కాలానికి పారిశ్రామిక రాయితీల కోసం ఉద్దేశించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత ప్రత్యేక హోదా పారిశ్రామిక రాయితీలు లేవని బుకాయించిన కేంద్ర ప్రభుత్వం నుండి ఇందుకు సమాధానం లేదు.
అంతేకాదు. అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. ప్రత్యేక హోదా అనుభవించే రాష్ట్రాలు పొందే విదేశీ రుణాల్లో 90 శాతం గ్రాంట్‌ కింద...పది శాతం మాత్రమే రుణం కింద వుంటుంది. ఈ రుణం కూడా 9 శాతం వార్షిక వడ్డీతో 20 ఏళ్లల్లో 20 సమాన వాయిదాల్లో చెల్లించాలి. విదేశీ రుణాలు తగ్గిపోతున్నాయనే నెపం పెట్టి ఆంధ్రప్రదేశ్‌ కు అప్పట్లో పారిశ్రామిక రాయితీలకు తెర దించి ప్రత్యేక ప్యాకేజీ రుద్దబడింది. కేంద్ర ప్రభుత్వం ఇంత దొంగాట ఆడటానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఊతం ఇచ్చాయి.
ప్రత్యేక హోదా సాధారణ రాష్ట్రాల మధ్య ఎలాంటి తేడాను 14వ ఆర్థిక సంఘం సూచించలేదు. 2015 నుండి అప్పటికి అమలులో వున్న నాలుగు పథకాలను రద్దు చేసింది. ఈ ఒక్క కారణం చూపెట్టి ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఒకవైపు పారిశ్రామిక రాయితీలకు నిధులు లేవంటూనే అప్పటి వరకు ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు ఒక్కసారిగా పదేళ్ల కాలానికి మంత్రి వర్గ ఆమోదంతో కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రధాని ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చేసరికి రిక్త హస్తాలు చూపెట్టారు.
నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత...కేంద్రం ఏ రాష్ట్రానికైనా నిధులు ఇవ్వాలంటే రాజకీయ ప్రయోజనం వుండి తీరాలి. ఆ దుష్ట విధానమే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా లేకుండా చేసింది. ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు రాష్ట్రంలో బిజెపి నాయకత్వాన్ని మార్పు చేసింది. ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ బలహీనతలు గుర్తించి తదనుగుణంగా భావోద్వేగాలు రెచ్చగొట్టే నేతకు పట్టం గట్టారు. పథకం ప్రకారం బిజెపి నేతలు సృష్టించిన ఈ భావోద్వేగం నేడు రాష్ట్రాన్ని చుట్టుముడుతోంది.
రాష్ట్రాభివృద్ధికి ఆలంబన అయిన ప్రత్యేక హోదా కనుమరుగు చేసేందుకు బిజెపితో పాటు వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి పార్టీలు తమకు తోచిన ఇంధనం సరఫరా చేస్తున్నాయి. రాజ్య సభలో టిడిపి సభ్యుడు ఒకరు ఆలయాల్లో సంప్రదాయాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. కాని ప్రత్యేక హోదా గుర్తుకు రాకపోవడం యాదృచ్ఛికం కాదు. కమలనాథులు కన్నెర్ర చేయకుండా టిడిపి జాగ్రత్త పడుతున్నది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తనకు 25 పార్లమెంటు సభ్యులను గెలిపించితే ప్రత్యేక హోదా సాధిస్తానని నమ్మించి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన రాజకీయ భవిష్యత్తుకు పణంగా పెట్టుకుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం గాలికి వదిలేసిన పార్టీలకు గుణపాఠం కలిగించి ప్రత్యేక హోదా సాధించాలంటే ప్రజా పోరాటాలే మార్గం.
(వ్యాసకర్త విశ్రాంత పాత్రికేయులు,
సెల్‌ : 9848394013)