- బిజెపిని ఓడించడానికి 'ఇండియా'తో కలిసి పోటీ : చలసాని
ప్రజాశక్తి-గుంటూరు : ప్రత్యేక హోదా కోసం అక్టోబర్ నుంచి వామపక్షాలు, విద్యార్థి, యువజన ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమ కార్యాచరణ చేపడతామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ తెలిపారు. ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని, హోదా సాధించే వరకూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు సాగిలపడుతున్నాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చే పార్టీలను తుక్కుతుక్కుగా ఓడించాలని కోరారు. ఆయా పార్టీలను ఓడించడానికి అవసరం అయితే ఇండియా కూటమితో కలిసి 25 స్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన స్పందిస్తూ కక్షసాధింపు చర్యలపై పెట్టిన దృష్టి హోదాపై పెట్టాలని హితవు పలికారు. విచారణ సక్రమ మార్గంలో చేపట్టాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్, సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఉస్మాన్ మాట్లాడారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని బిజెపి మోసం చేస్తోందన్నారు. కడప ఉక్కును నిరాకరించడమే కాకుండా, విశాఖ ఉక్కును ప్రయివేటీకరించేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. హోదా కోసం భవిష్యత్‌లో పోరాటాలకు పునరంకితం కావాలని కోరారు. సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు పి.వి.మల్లికార్జునరావు, తాటికొండ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.










