న్యూఢిల్లీ : ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని లడఖ్‌లోని లెహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి) మరియు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కెడిఎ)లు స్పష్టం చేశాయి. అలాగే కేంద్రపాలిత ప్రాంతం (యుటి)లో ఆరోషెడ్యూల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశాయి. లడఖ్ ప్రజలకు మంచి పాలనను అందించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైనపుడు .. జమ్ము కాశ్మీర్ నుండి ఎందుకు వేరు చేశారని కెడిఎ ప్రశ్నించింది.
''గతంలో ప్రాతినిథ్యం, రాష్ట్రహోదా, ప్రత్యేకహోదాలతో మేం ప్రయోజనం పొందుతున్నాం. కానీ నేడు మా యువత నిరుద్యోగంతో బాధపడుతోంది. యుటిలో మా గొంతు వినిపించడం లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు'' అని కెడిఎకి చెందిన సజ్జద్ మండిపడ్డారు.
''లడఖ్ ప్రజలకు శాసనాధికారాలు ఉండాల్సిందే. మా భూమిని, సంస్కృతిని, ఉద్యోగాలను, గుర్తింపును కాపాడాలనుకుంటున్నాం. విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టతనిచ్చేలా సుప్రీంకోర్టులో నివేదికను సమర్పించాలని కోరుకుంటున్నాం'' అని ఎల్‌ఎబి సభ్యులు త్సెరింగ్ పేర్కొన్నారు.
లడఖ్‌లో ఎల్‌ఎబి, కెడిఎలు మత, సామాజిక, రాజకీయ సంస్థలు. లడఖ్ ప్రజలకు ఆ ప్రాంతంపై పాలన నిర్వహించే హక్కు ఉండాలని కోరుకుంటున్నాయి. అలాగే లడఖ్‌కి రాష్ట్రహోదాను, స్థానికులకు ఉపాధి కల్పించేందుకు వారు లేహ్ మరియు కార్గిల్ రెండు లోక్‌సభ స్థానాలు లడఖ్‌కు ప్రత్యేక సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్టికల్ 370 రద్దుపై విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లడక్ కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతుందని, జమ్ముకాశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని సుప్రీంకోర్టుకు వివరించిన సంగతి తెలిసిందే.










