బాలాసోర్ : సీనియర్ బిజెపి నేత, కేంద్ర గిరిజన వ్యవహారాలు, జలశక్తి మంత్రి బిషేశ్వర్ టుడు సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) ద్వారా నియమితులైన అధికారుల్లో పలువురు దోపిడీదారులేనని వ్యాఖ్యానించారు. కోడిని దొంగతనం చేసినవాడు శిక్షించబడతాడు, కానీ ఖనిజ మాఫియాకు పాల్పడిన అధికారిని ఎన్నడూ పట్టుకోలేమని, ఎందుకంటే వ్యవస్థ ఆ అధికారికి రక్షణ కల్పిస్తుందని ఆరోపించారు. బాలాసోర్ జిల్లాలోని బలియాపాల్ ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యుపిఎస్‌సి ద్వారా నియమితులైన వారు చాలా నాలెడ్జ్ కలిగిన వ్యక్తులని, ఉన్నత స్థానాల్లో వుంటారని మనం భావిస్తాం. కానీ, వారిలో చాలా మంది దోపిడీదారులని తాను భావిస్తున్నానని అన్నారు. వంద శాతమూ అలాగే వుంటారని అనడం లేదు. కానీ చాలా మంది దోపిడీదారులేనని గట్టిగా నొక్కి చెప్పారు. ఢిల్లీలో తన నివాసం వెనుకే యుపిఎస్‌సి కార్యాలయం వుందని, మొదట్లో తనకు దాని పట్ల చాలా గౌరవం వుందని, కానీ ఇప్పుడు అది మారిందని అన్నారు. ఇంతమంది విద్యావేత్తలు వున్నప్పుడు మన సమాజం ఇంతలా అవినీతి, అన్యాయంతో ఎలా నిండిపోతుందని ప్రశ్నించారు.










