Apr 24,2023 15:23

కోల్‌కతా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సోమవారం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ప్రతిపక్ష పార్టీల సంకీర్ణ కూటమిని రూపొందించేందుకు వీరు కసరత్తు చేస్తున్నారు. 2024లో లోక్‌సభ ఎన్నికల కోసం కలిసి సన్నద్ధమవాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు నొక్కి చెప్పారు. ఈ సమావేశానికి బీహార్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ కూడా హాజరయ్యారు. ''చాలా సానుకూల చర్చలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కూర్చుని వ్యూహ రచన చేయాల్సివుంది.'' అని నితీష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సచివాలయం నబన్నాలో ఈ సమావేశం జరిగింది. ''మేమందరం కలిసే వున్నామని సందేశం ఇవ్వాల్సి వుంది.'' అని మమతా సమావేశం నుండి బయటకు వస్తూ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు పనిచేయగల సంకీర్ణం రూపకల్పన కోసం ఎలా ముందుకు సాగాలన్నది ఆ సమావేశంలో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు దేశ అభివృద్ధి కోసం జరిగిందేమీ లేదు. పాలించినవారు వారి సొంత ప్రచారం పట్లే ఆసక్తి చూపారని నితీష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.