Oct 03,2020 06:56

చట్టబద్ధంగా తమకు ఖర్చు చేయాల్సిన నిధుల కోసం, ఉపాధి భరోసా కోసం భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు గురువారం నాడు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమం న్యాయసమ్మతమైనది. శాంతియుత నిరసన తెలియజేసేందుకు కూడా అనుమతులివ్వకుండా ముందస్తు నోటీసులతో పోలీసులు బెదిరింపులకు దిగినా, అరెస్టులు చేసి నిర్బంధాలకు గురిచేసినా పోరాట పటిమతో పోరు సల్పడం అభినందనీయం. కష్టాల్లో ఉన్న సమయాల్లో ఆర్థిక చేయూతనందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే దోచుకోవడం మొదలు పెడితే ఎలా వుంటుందనేది భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల దుస్థితిని చూస్తే అర్థమవుతుంది.
'బాబూ మీ సొమ్మేం వద్దు..కనీసం మాకు ఖర్చు చేయాల్సిన డబ్బులు దారి మళ్లించకుండా ఇవ్వండి' అని విన్నవించినా పాలకులకు మనసొప్పలేదంటే ఏమనాలి? కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా నిర్దిష్ట అవసరాల కోసం ప్రజల నుంచి 'సెస్‌' వసూలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సేకరించిన సెస్‌ నిధులను వారి సంక్షేమానికి ఖర్చు చేయకుండా గతంలో టిడిపి ప్రభుత్వం 'చంద్రన్న బీమా' పేరుతో దారి మళ్లించి దగా చేసింది. ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపి కూడా టిడిపి దారిలోనే నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించి అన్యాయానికి పాల్పడటం ప్రజా పాలకులమని చెప్పుకునేవారికి సమంజసం కాబోదు.
వాస్తవానికి ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో స్థిరాస్తి రంగం, నిర్మాణ రంగం కుదేలైపోయింది. ప్రభుత్వ, ప్రయివేటు ప్రాజెక్టులతో పాటు సామాన్య నిర్మాణ పనులూ తాబేలు నడకను అనుసరించాయి. తాపీ పట్టి మౌలిక సదుపాయాలకు నగిషీలు దిద్దే కష్టజీవులు పస్తులతో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి ఏర్పడింది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు కరోనా విజృంభించడం, లాక్‌డౌన్‌ ఆంక్షలు నిర్మాణ కార్మికుల పట్ల సమ్మెట పోటయ్యాయి. రెక్కాడితేకాని డొక్కాడని దిన కూలీల బతుకులు వీధుల పాలయ్యాయి. వరుస కష్టాలతో ఊహించని కడగండ్ల పాలైన కార్మికుల పాలిట లోపభూయిష్టమైన ఇసుక విధానాలు యమపాశాలయ్యాయి. ఆకలి మంటలతో మలమలలాడుతున్న వారికి ఉపాధి కల్పించి భరోసా ఇవ్వకపోగా జీఓ 17 ద్వారా సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం కష్టజీవులకు ఎగనామం పెట్టింది. ఏకంగా రూ.450 కోట్లు దారిమళ్లాయి. ఇంత అన్యాయం చేయబట్టే కార్మికుల కడుపులు మండాయి. తమను వీధుల పాల్జేసిన ప్రభుత్వాల విధానాలపై పోరుజెండా ఎగరేశాయి.
బడుగు జీవుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని గొప్పలు చెబుతున్న నేతలు ఇప్పటికైనా నిర్మాణ రంగ కార్మికుల ఆర్తనాదాలు ఆలకించాలి. కార్మికులేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. అన్యాయంగా దారి మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను వెనక్కి ఇచ్చేయాలనడం చట్టబద్ధంగా వారి హక్కు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను తక్షణమే చెల్లించాలనడం కూడా న్యాయసమ్మతమైనదే. ఇసుకను ఉచితంగా సరఫరా చేయడం, బిల్డింగ్‌ మెటీరియల్‌ ధరలు తగ్గించడం ద్వారా నిర్మాణ రంగ పనులను పట్టాలెక్కిస్తే దిన కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఇటు ఆర్థిక వ్యవస్థకూ ఊపిరి అందుతుంది. ఇసుక విధానాలు, కరోనా ఆంక్షలతో ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో భవన, ఇతర నిర్మాణ కార్మికులందరికీ ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. సంక్షేమ బోర్డు నిధులను ఖర్చు చేస్తే చాలు. కలల సౌధాలను నిర్మించే ఈ కష్టజీవులకు నిలువ నీడ కూడా కరువైన నేపథ్యంలో ప్రతి కార్మిక కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. గత టిడిపి ప్రభుత్వ విధానాలతో విసిగి వేసారిన ప్రజలు కొత్త ఆశలతో ఎన్నుకున్న ప్రభుత్వం కూడా మోసం చేస్తే వారికి దిక్కెవరు? ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామని చెబుతున్న పాలకులు ఇప్పటికైనా భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.