ప్రజాశక్తి - సీతమ్మధార
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి రావలసిన క్లైయిమ్స్ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ విశాఖ జిల్లా బిల్డింగ్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీసు వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు గ్రేటర్ విశాఖ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ సంక్షేమబోర్డు నుంచి కార్మికులకు రావలసిన డెలివరీ, వివాహ, ప్రమాద క్లైయిమ్స్ నిలిచిపోయాయని తెలిపారు. సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమ కోసం కాకుండా ఇతర పథకాలకు మళ్లించడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వం ఈ విధంగా 830 కోట్లు మళ్లించిందని, ఆ నిధులు తక్షణమే సంక్షేమ బోర్డులో జమచేయాలని, క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరోనా, లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి ప్రతి కుటుంబానికీ రూ.10వేలుచొప్పున ఇవ్వాలన్నారు. నిర్మాణ యజమానులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని సంక్షేమబోర్డుకు కోట్లాది రూపాయలు సెస్సు ఎగ్గొడుతున్నారని ప్రభుత్వం వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రరాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖలో డిప్యూటీ లేబరు కమిషనరు మూడేళ్లగా లేకపోవడం కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.శ్రీనివాసరావు బి.వెంకటరావు మాట్లాడుతూ ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని, భారీగా పెరిగిన సిమెంటు, ఇనుము ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు పి.అనసూయ, రాజశేఖర్, ఎంవి.ప్రసాదు, ఎన్. సింహాచలం, కె.పెంటారావు, వి.క్రిష్ణరావు, శ్రీనివాసరావు, అప్పలరాజు, సుబ్బారావు, అప్పారావు పాల్గొన్నారు.










