శాన్‌ఫ్రాన్సిస్కో : అమెజాన్, ట్విటర్, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాల బాటలో తాజాగా మైక్రోసాఫ్ట్ చేరింది. ఆర్థిక అస్థిరతలు, మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో వ్యయ నియంత్రణ పేరుతో టెక్ సంస్థలు భారీగా ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మైక్రోసాఫ్ట్ 11వేల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు సమాచారం. మొత్తం సిబ్బందిలో ఐదు శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. బుధవారం నుండి మైక్రోసాఫ్ట్‌లో తొలగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. ఇంజినీరింగ్ విభాగాల్లో అధికంగా తొలగింపులు ఉండవచ్చని నివేదించింది. గతేడాది జూన్ 30 నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌లో 2,21,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యక్తిగత కంప్యూటర్ల పరిశ్రమలో కొన్ని త్రైమాసికాల నుంచి నిర్లిప్తత నెలకొనడంతో విండోస్ సహా మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో గతేడాది జులైలో కొంతమంది ఉద్యోగుల్ని తొలగించింది. అక్టోబరులోనూ సుమారు 1,000 మందిపై వేటు వేసింది.










