Jan 23,2021 21:53

పద్దపడమలలో నిరసన తెలుపుతున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కర్కసంగా వ్యవహరిస్తోందని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేసేందుకు కుట్ర చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోవు రోజుల్లో రైతులు గుణపాఠం నేర్పుతారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.నాగేంద్రకుమార్‌ అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావంగా నల్ల చట్టాలు రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు. అనంతపురం రూరల్‌ మండల పరిధిలో నిర్వహించిన ఆందోళనకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.నాగేంద్రకుమార్‌, రైతు సంఘం నాయకులు లక్ష్మినారాయణ, గోపాల్‌ హాజరయ్యారు. నారాయణపురంలో నిర్వహించిన ఆందోళనలకు సిఐటియు నగర నాయకులు వి.రామిరెడ్డి, ప్రకాష్‌, రుద్రంపేట సచివాలయంలో నిర్వహించిన ఆందోళనలకు సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శివప్రసాద్‌ తదితరులు హాజరై నిరసన తెలిపారు. అనంతరం ఆయా సచివాలయాల కార్యదర్శులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తుంటే మోదీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా అమలు చేయడానికి కుట్రలు చేస్తోందన్నారు. 60 రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్నా నామ మాత్రపు చర్చలు నిర్వహించి రైతులను అవహేళన చేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 26న నిర్వహిస్తున్న ట్రాక్టర్‌ల ర్యాలీని ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఓబులదేవరచెరువు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేందుకే నల్ల చట్టాలను తీసుకువచ్చిందన్నారు. రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. వ్యవసాయ రంగంలో నూతన చట్టాలు అమలు చేస్తే సన్న, చిన్నకారు, కౌలు రైతులు కార్పొరేట్‌ కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం బరితెగించి తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేసి, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారస్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నినరసనగా ఈనెల 26న రైతులతో, 27వ తేదీన అంగన్వాడీ కార్యకర్తలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 28వ తేదీన ఆశావర్కర్ల తో కలెక్టరేట్‌ ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ, రమణ, శ్రీరాములు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు మణిమాల, ఆశీర్వాదం, సరస్వతి, కార్మిక సంఘం నాయకుడు అంజినప్ప తదితరులు పాల్గొన్నారు.
గుంతకల్‌ రూరల్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సిఐటియు నాయకులు సచివాలయాల ఎదుట శనివారం వినూత్న నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, మారుతిప్రసాద్‌, తిమ్మప్ప, నాగరాజు, జగ్గలి రమేష్‌, చంద్రశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు కసాపురం రమేష్‌, సునీల్‌, రాముడు నాయక్‌, జాకీర్‌, వెంకీ, రాజేష్‌, సూరి, నాగేంద్ర, ఈరన్న పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం : నల్లచట్టాలను రద్దుచేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప ఆధ్వర్యంలో సచివాలయాల ఎదుట నిరసన తెలిపారు. కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పండ్లతోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి శివారెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శి డి.శ్రీనివాసులు, వ్యకాసం నాయకులు నాగ లింగమయ్య, కుల్లాయప్ప, కెవిపిఎస్‌ మండల నాయకులు హరికష్ణ, రైతు సంఘం మండల నాయకులు సంజీవరెడ్డి, వెంకట, కొండా, నారాయణస్వామి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పుట్లూరు : సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సచివాలయాల ఎదుట నిరసన తెలిపారు. సిఐటియు మండల మండల కార్యదర్శి విటి.రామాంజినేయులు, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటచౌదరి, వ్యకాసం మండల కార్యదర్శి సూరి, భవన నిర్మాణ సంఘము మండల కార్యదర్శి వి.వెంకటేష్‌, రైతులు నరేష్‌ నాయుడు, సూర్యనారాయణరెడ్డి, సూరి తదితరులు పాల్గొన్నారు.
పామిడి : ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో గజరాంపల్లి సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిమిరెడ్డి, వ్యకాసం జిల్లా మహిళా కన్వీనర్‌ నిర్మల, మండల కార్యదర్శి మల్లేష్‌, వెంకటేష్‌, నారాయణరెడ్డి, వెంకటరామిరెడ్డి, పెద్దిరెడ్డి, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
శింగనమల : సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తరిమెల, రాచేపల్లి, ఉల్లికల్లు, సలకంచెరువు, సింగనమల గ్రామ సచివాలయాల ఎదుట ఎద్దుల బండి మీద మోకాళ్ల మీద నిలుచుని నిరసన తెలిపారు. వ్యకాసం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్‌, మండల కార్యదర్శి ఎర్రిస్వామి, రైతు సంఘం మండల కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, సిఐటియు మండల కార్యదర్శి గిరి, అధ్యక్షులు గంపమల్లయ్య, రామాంజనేయులు, శంకర, ఓబులేసు, సుంకన్న, కుల్లాయప్ప, నాగయ్య, కొండారెడ్డి, బాలరాజు, ఆది, లాల్‌ మునయ్య తదితరులు పాల్గొన్నారు.
తాడిపత్రి రూరల్‌ : పెద్దపడమల, చిన్నపడమల గ్రామ సచివాలయాల ఎదుట సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను సచివాలయ కార్యదర్శులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ మెంబర్‌ జగన్మోహన్‌రెడ్డి, నాయకులు ఉమాగౌడ్‌, నరసింహారెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శి రాజారామ్‌రెడ్డి, బాలనరసింహారెడ్డి, చౌడయ్య, కృష్ణారెడ్డి, వెంకటరమణ, నారాయణస్వామి, శ్రీనివాసులు, చక్రి రైతులు పాల్గొన్నారు.