-గ్రూపు ఇన్సూరెన్స్, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలి
- సర్క్యులర్ 64ను రద్దు చేయాలి
- ముగిసిన 36 గంటల యానిమేటర్ల నిరసన దీక్షలు
ప్రజాశక్తి - యంత్రాంగం:మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ 64ను వెంటనే రద్దు చేయాలని, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, డ్వాక్రా సంఘాల మెర్జింగ్ ఆపాలని, కనీస వేతనం రూ.26 వేలు అందజేయాలని డిమాండ్ చేస్తూ వెలుగు విఒఎలు (యానిమేటర్లు) చేపట్టిన 36 గంటల నిరసన దీక్షలు విజయవంతంగా ముగిశాయి. రెండోరోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద వంటావార్పు చేపట్టి, నిరసన చేపట్టారు. యానిమేటర్లను పశ్చిమగోదావరి, అన్నమయ్య, శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డగించారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్దే మంగళవారం రాత్రి యానిమేటర్లు బస చేశారు. బుధవారం స్థానిక తిరుమల విద్యాసంస్థలు వద్ద నుంచి యానిమేటర్లు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయల్దేరారు. పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టగా.. తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కలెక్టరేట్ ప్రాంగణం వరకు పోలీసు పహారా మధ్య ర్యాలీ కొనసాగింది. అనంతరం కలెక్టరేట్ ఎదురుగా బైఠాయించారు. డిఆర్‌డిఎ పిడికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ.. విఒఎలను, ఆర్‌పిలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని సిసిలు, ఎపిఎంలకు చెప్పామన్నారు. మండల, గ్రామ సమాఖ్యలతో మాట్లాడి గుర్తింపు కార్డులు, యూనిఫారం ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనకాపల్లి కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.రూపాదేవి, జిల్లా గౌరవాధ్యక్షులు వివి.శ్రీనివాసరావు మాట్లాడారు. యానిమేటర్ల బతుకులు దినదినగండంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర పని ఒత్తిడితో పలువురు అనారోగాల బారిన పడుతున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి, సిఐటియు, ఐద్వా, టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు. విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. తొలుత వీరు ఐటిడిఎ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. చింతూరు, రంపచోడవరం ఐటిడిఎల ఎదుట ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నానుద్దేశించి వెలుగు విఒఎ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విఒఎల, ఆర్‌పిల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. రెండోరోజు ధర్నాలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పాల్గని మద్దతు ప్రకటించారు. విఒఎల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, మిగిలిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని డిఆర్‌డిఎ పిడి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం కలెక్టరేట్ ముట్టడి చేపట్టేందుకు ప్రయత్నించిన సిఐటియు నాయకులు, విఒఎలను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 250 మంది నాయకులను అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేష్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేశారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యానిమేట్లర్లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం యానిమేటర్లు, సిఐటియు నాయకులు డిఆర్‌ఒ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. బాపట్ల, గుంటూరు, తూర్పుగోదావరి, ఒంగోలు, తిరుపతి, కర్నూలు ధర్నా చౌక్, నంద్యాల కలెక్టరేట్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. బాపట్లలో ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు.










