Apr 15,2023 21:45

- అనంతలో ఉద్యోగ,ఉపాధ్యాయ జెఎసి నాయకుల నిరసన
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ :అనంతపురం కార్పొరేషన్‌ అధికారులపై బిజెపి నేతల నోటి దురుసు, దాడిపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా నిససనాగ్రహం పెల్లుబికింది. అధికారులను 'బట్టలూడదీసి కొడతా' అంటూ అవమానకరంగా మాట్లాడిన బిజెపి నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఐక్య ఉద్యోగ, ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో ఉద్యోగులు శనివారం ఉదయం కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి డిఎస్‌పి కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడే బైటాయించి ధర్నా చేశారు. సిఐటియు, పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌జిఒ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్లాస్టిక్‌ నిషేధ చట్టాన్ని అమలు చేస్తున్న అనంతపురం నగర పాలక సంస్థ అధికారులను బిజెపి నాయకులు లలిత్‌కుమార్‌, ఫయాజ్‌ బూతులు తిట్టడం దుర్మార్గం అన్నారు. చట్టాన్ని అమలు చేసే అధికారులను తులనాడిన తీరు సభ్యసమాజం తలదించుకునేదిలా ఉందని తెలిపారు. అనంతపురంలో నిషేధం విధించిన ప్లాస్టిక్‌ వస్తువులను అమ్ముతున్న వ్యాపారులతో బిజెపి నేతలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు వారి చర్యలను బట్టి స్పష్టంగా అర్థమవుతోందని దుయ్యబట్టారు. అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన బిజెపి నాయకులపై తక్షణమే కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిఎస్‌పి కార్యాలయంలో సిఐ జాకీర్‌ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సిపిఎం నాయకులు ఆర్‌వి.నాయుడు, సిఐటియు నగర కార్యదర్శి వెంకట నారాయణ, మూర్తుజా, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.