Sep 14,2023 21:40

- పలువురు సిఐటియు నాయకుల అరెస్టు, విడుదల
ప్రజాశక్తి-తుని(కాకినాడ జిల్లా) :సంక్షేమం పథకాలను పునరుద్ధరించాలని, 2019 నుంచి పెండింగులో ఉన్న క్లెయిమ్‌లు పరిష్కరించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన రాయబార ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ జిల్లా తునిలో రాజా గ్రౌండ్‌ నుంచి మంత్రి దాడిశెట్టి రాజా ఇంటికి వరకు భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురు సిఐటియు, భవన నిర్మాణ సంఘం కార్మికులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొంత మందిని ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. కాకినాడ జిల్లా నలుమూలల నుంచి తునికి బయలుదేరిన భవన నిర్మాణ రంగ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని తుని రాజా గ్రౌండ్‌ వద్దకు చేరుకున్న కార్మికులు ర్యాలీగా మంత్రి దాడిశెట్టి రాజా ఇంటికి బయలుదేరడంతో సిఐ సన్యాసిరావు ఆధ్వర్యంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులను తోసుకుంటూ మంత్రి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్టులు చేసి తుని టౌన్‌, రూరల్‌, కోటనందురు, తొండంగి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. సంక్షేమం పథకాలను పునరుద్ధరించాలని, పెండింగులో ఉన్న క్లెయిమ్‌లు పరిష్కరించాలని, ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న అన్ని పథకాలను అమలు చేయాలని నినదించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, నాయకులు షేక్‌ పద్మ, భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, నాయకులు దారపురెడ్డి క్రాంతి, మేడిశెట్టి వెంకటరమణ, మాగాపు నాగు తదితరులను పోలీస్ట్‌ స్టేషన్లకు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. పిఠాపురంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు కరణం విశ్వనాథం, కుంచె చిన్న గృహనిర్భందం చేశారు. పలువురు నాయకులను అరెస్టు చేశారు.