Jun 08,2022 07:47
  • ఎంటియు 1061, బిపిటి 5204పై ఆసక్తి
  • రాయితీపై అరకొరగానే విత్తనాలు
  • ఖరీఫ్‌కు సన్నద్ధవుతున్న రైతులు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : కృష్ణా డెల్టా ఆయకట్టుకు ఈ నెల పదిన నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కాలువల ఎగువ ప్రాంతాల్లోని రైతులు వరి నారుమళ్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నమైన వరి రకాలను సాగు చేసే ఈ ప్రాంత రైతులు గతేడాది మిల్లర్లు ఎక్కువగా కొనుగోలు చేసిన వరి వంగడాలపై ఈసారి ఆసక్తి చూపుతున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 4,57,152.5 ఎకరాలు. ఇందులో అత్యధికంగా 4,27,690 ఎకరాల్లో వరి సాగవుతోంది. నీటి లభ్యత, రెండో పంట అపరాల సాగుకు అనుగుణంగా నవంబర్‌ రెండో వారం నుంచి వరి కోతలకు వచ్చే విధంగా ప్రాంతాల వారీగా 150 రోజుల కాలపరిమితి ఉండే దీర్ఘకాలిక, 140 రోజులు మధ్యకాలిక, 125 నుంచి 135 రోజుల్లో అందుబాటులోకి వచ్చే స్వల్పకాలిక వంగడాలను ఎంచుకుని సాగు చేస్తారు. గతేడాది 12 రకాల వరి వంగడాలను వ్యవసాయ శాఖ సిఫార్సు చేసింది. అయితే, ఎంటియు 1061 (ఇంద్ర), 1121 (శ్రీధృతి) రకాలకు మాత్రమే మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 75 కిలోల బస్తాను రూ.1470కు కొనుగోలు చేశారు. సూపర్‌ ఫైన్‌ వెరైటీల్లోనూ బిపిటి 5204కు మాత్రమే మార్కెట్లో ధర లభించింది. మిగిలిన వెరైటీలను బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గించి మిల్లర్లు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోయారు. దీంతో, రైతులు ఎంటియు 1061, 1121, బిపిటి 5204 రకాల సాగుకు ఈసారి మొగ్గు చూపుతున్నారు.
 

                                                           నామమాత్రంగానే రాయితీ విత్తనాలు

ఎకరం విస్తీర్ణంలో నారు మడికి 30 కిలోల వరి విత్తనాలు అవసరమవుతాయి. జిల్లాలోని మొత్తం విస్తీర్ణానికి 1,28,307 క్వింటాళ్ల విత్తనాలు అవసరం. జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా 6,990 క్వింటాళ్ల విత్తనాలను కిలో రూ.5కు చొప్పున రాయితీపై ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు ఆసక్తి చూపుతున్న ఎంటియు 1061కు అత్యధికంగా 3,760 క్వింటాళ్లు, బిపిటి 5204 రకం విత్తనాలు 1695 క్వింటాళ్లు, ఎంటియు 1224 రకానికి 950 క్వింటాళ్లు, ఎంటియు 1285 రకానికి 285 క్వింటాళ్లు కావాలని ఎపి సీడ్స్‌కు ఇండెంట్‌ పెట్టారు. ఇవి రైతులకు సరిపోయే పరిస్థితి లేదు. దీంతో, అత్యధిక మంది రైతులు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఉంది.
 

                                                                       12 రకాలు సిఫార్సు

ఏ గ్రేడ్‌ వరి రకాలు ఎంటియు 1061 (ఇంద్ర), ఎంటియు 7029 (స్వర్ణ), ఎంటియు 1140 (భీమ), ఎంటియు 1172 (క్షీర), ఎంటియు 1121 (శ్రీధృతి), సూపర్‌ ఫైన్‌ వెరైటీలు బిపిటి 5204 (సాంబ మసూరి), ఎంటియు 1224 (మార్టెరు సాంబ), బిపిటి 2782 (భవతి), బిపిటి 2595 (తేజ), ఎంటియు 1262 (గోదావరి సాంబ), ఎంటియు 1190 (వరం), ఎంసిఎం 100 (పాండురంగ) తదితర రకాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తోంది.