- కనీస నిర్వహణ పనులకు నిధుల లేమి
- రూ.45.88 కోట్లతో ప్రతిపాదనలతోనే సరి
- ముందుకుసాగని అవుట్‌ఫాల్ స్లూయిజ్ల పనులు
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : కృష్ణా డెల్టాలో సాగునీటి కాల్వలు, డ్రెయిన్లకు ఈ ఏడాది ముందస్తుగానే మరమ్మతులు చేపడతామని ప్రభుత్వం చెప్పినా అమలుకు నోచుకోలేదు. 208 పనులకు రూ.45.88 కోట్లతో జలవనరుల శాఖ పంపిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ మరమ్మతుల కారణాన్ని చెబుతూ కృష్ణా జిల్లాలో దాళ్వా వరి సాగుకు నీటి విడుదలను ప్రభుత్వం నిలిపివేసింది. కానీ, పనులను మాత్రం ప్రారంభించలేదు. నిధులలేమి వల్ల ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ పనుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.
నిధులు లేక ఔట్ ఫాల్ రెగ్యులేటర్‌ల ఆధునీకరణలో జాప్యం
సముద్రంలోని నీరు డ్రెయిన్లలోకి రాకుండా, పంట పొలాల్లోని మురుగు నీరు డ్రెయిన్ల ద్వారా సముద్రంలోకి వెళ్లేలా మూడు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం డ్రెయిన్లు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో అవుట్ ఫాల్ రెగ్యులేటర్లను ఏర్పాటు చేసింది. తీర ప్రాంత భూములు ముంపునకు గురికాకుండా ఈ రెగ్యులేటర్లు రక్షణగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇవి కనీస మరమ్మతులకు నోచుకోకవడంతో రెగ్యులేటర్ల షటర్లు ధ్వంసమయ్యాయి. దీంతో, తరచూ ముంపు సమస్య ఎదురవుతోంది. కోడూరు, నాగాయలంక, కృత్తివెన్ను మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఏటా ముంపునకు గురవుతున్నాయి. నష్టాలను భరించలేక కోడూరు మండలంలోని మూడు వేల ఎకరాల్లో రైతులు పంటల సాగు మానుకున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఎనిమిది అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల ఆధునీకరణకు మూడు నెలల క్రితం రూ.35 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది.
నీటి తీరువా వసూలైతేనే ఒ అండ్ ఎం పనులు !
విజయవాడ కెసి, కెఇ, సెంట్రల్, గుడివాడ డ్రెయినేజీ డివిజన్ల పరిధిలోని 208 కాలువలతోపాటు డ్రెయిన్ల ఒ అండ్ ఎం పనులకు రూ.45.88 కోట్లతో జలవనరుల శాఖ ప్రతిపాదించింది. కానీ, ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. వసూలైన నీటి తీరువా డబ్బులతోనే పనులు చేయాలని సూచించింది. నీటి తీరువా రూ.45.88 వసూలు కావాల్సి ఉండగా 32.66 కోట్లు వసూలయ్యాయి. పనుల అంచనా మేరకు మిగిలిన రూ.13.22 కోట్ల నిధులు విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తారో ?
ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, పశ్చిమగోదావరి ఉమ్మడి జిల్లాల్లో 7.37 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, ఆక్వా సాగవుతున్నాయి. బందరు, కృష్ణా ఈస్టు బ్యాంక్ కెనాల్ (కెఇబి), ఏలూరు, రైవస్ కాల్వల ద్వారా ఖరీఫ్, రబీ పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీటి అవసరాల కోసం ఏటా 100.59 టిఎంసిలను అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ కాలులతోపాటే అధిక వర్షాల సమయంలో పంటలు ముంపు బారిన పడకుండా అదనపు నీటిని వేగంగా సముద్రంలోకి తరలించేందుకు వేలాది కిలోమీటర్ల మేర మేజర్, మీడియం, మైనర్ డ్రెయిన్లు డెల్టాల్లో ఉన్నాయి. కాల్వల నిర్వహణ సరిగా లేక పంటల సాగు సమయంలో నీటి ఎద్దడి ఎదురవుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ నిర్వహణ సరిగా లేక ముంపు కారణంగా రైతులు పంటలను నష్టపోతారు. ఈ నేపథ్యంలో కాల్వలు, డ్రెయిన్లలో పేరుకుపోయిన తూడు, కర్ర నాచు, మట్టిని తొలగించడం, బలహీన కట్టలను పటిష్టపరచడం తదితర ఒ అండ్ ఎం వర్కులు చేయాలి. కాల్వలు, డ్రెయిన్లలో నీరు ఉండని వేసవి కాలం ఈ పనులు చేయడానికి అనుకూలం. కానీ, ఇప్పటి వరకు కనీసం టెండర్లను కూడా పిలువలేదు. దీంతో, ఖరీఫ్ పంటలకు నీరు విడుదల చేసేలోగా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
త్వరలో పనులు
కాల్వలు, డ్రెయిన్ల నిర్వహణలో భాగంగా 208 ఒ అండ్ ఎం పనులకు రూ.45.88 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తాం. సకాలంలో పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటాం.
-కె.శ్రీనివాసరావు,
డిస్ట్రిక్ట్ వాటర్ రిసోర్సెస్ ఆఫీసర్, కృష్ణా జిల్లా










