Dec 22,2022 12:00

న్యూఢిల్లీ  :   దళిత, కార్మిక హక్కుల కార్యకర్త శివ కుమార్‌ అక్రమ నిర్బంధం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడంపై విచారణ కమిటీ తమ నివేదికను పంజాబ్‌ మరియు హర్యానా హైకోర్టుకు సమర్పించింది. గతేడాది మార్చ్‌ 16వ తేదీన ఫరీదాబాద్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. కార్మిక హక్కుల కోసం పోరాడిన ఓ  వ్యక్తిని క్రూరంగా,దారుణంగా  హింసించడం సమంజసం కాదని పేర్కొంది. సోనెపట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి, జైలు అధికారులు విధుల నిర్వహణలో విఫలమయ్యారని హర్యానా పోలీసులు తెలిపారు. పోలీసులు శివకుమార్‌ను క్రూరంగా చిత్రహింసలకు గురిచేశారని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ మరియు ఆస్పత్రి (జిఎంసిహెచ్‌) ఆ నివేదికలో పేర్కొంది. పోలీస్‌ అధికారుల ఆదేశాలకనుగుణంగా వైద్యులు వ్యవహరించారని.. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంది. న్యాయవిచారణలో 15 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.

చమర్‌ కులానికి చెందిన వాడంటూ దూషించడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం, అతనిపై ఉమ్మివేయడం, చేతులు, కాళ్లను మరిగే వేడి నీటిలో ఉంచడం, ముఖంపై వాటర్‌ కెనాన్‌ను ఉంచడం, అతనిపై కుర్చీ వేసి దానిపై సిఐఎ( హర్యానాలోని క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ ) సిబ్బంది కూర్చోవడం, జుట్టు పట్టుకుని ఈడ్చడం, గాయాల నుండి రక్తస్రావమైనా చికిత్స అందించకుండా సంకెళ్లతో మంచానికి బంధించడం ఇలా క్రూరంగా హింసించినట్లు నివేదిక పేర్కొంది. రక్తస్రావమైనా వైద్యం అందించలేదని పేర్కొంది. శివకుమార్‌ కుడి పాదం ఎముక, ఎడమచేతిలోని ఓ వేలు కూడా విరిగాయని, ఇవేకాక అనేక గాయాలైనట్లు జిఎంసిహెచ్‌ వైద్యులు తెలిపారు. అయితే న్యాయవిచారణలో ఈ ఆధారాలను సాక్ష్యాలతో సహా రికార్డు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఎస్‌ఐ షంషేర్‌ సింగ్‌, ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ వినరు కక్రాన్‌లు కుమార్‌పై చిత్రహింసలకు పాల్పడిన నేరస్థులుగా పేర్కొనడంతో పాటు పూర్తిబాధ్యత వహించాలని తెలిపింది. ఈ నెల ప్రారంభంలో విడుదల చేయబడిన ఈ నివేదికను డిసెంబర్‌ 20వ తేదీన వెల్లడించారు.

ఇంతగా హింసించడానికి శివకూమార్‌ చేసిన నేరం కార్మికుల తరపున పోరాటం చేయడం, కార్మికులకు సరైన వేతనాలు చెల్లించకపోవడం, వేధింపులకు గురిచేయడాన్ని వ్యతిరేకిస్తూ కుండ్లీ ఇండిస్టియల్‌ అసోసియేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టడంతో పోలీసులు అతనిని అరెస్ట్‌ చేశారు. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవేశపెట్టిన మూడు వివాదాస్పద వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన రైతులకు కూడా సంఘీభావం ప్రకటించారు.