హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నాయకుల అసంతృప్తి వ్యక్తం అవుతుంది. తాజాగా కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ టిక్కెట్టును ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి అసంతృప్తి ఎదురైంది. దీంతో బీఆర్ఎస్ కు ఆయన ఈరోజు రాజీనామా చేశారు. ఈరోజు ఉదయమే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. కల్వకుర్తి అసెంబ్లీ స్థానంను సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే కేసీఆర్ టిక్కెట్టును కేటాయించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య విభేదాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నారాయణరెడ్డి పోటీ చేయాలని భావించినా అది జరగలేదు. ఈసారి కూడా తనకు ఆ సీటు దక్కకపోవడంతో పార్టీని వీడక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవితో పాటు కసిరెడ్డి నారాయణరెడ్డి రేవంత్‌ను కలిశారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డిని పోటీకి దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం.










