Oct 07,2020 18:21

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు ఏం జరుగుతోంది? దేశంలో ఇప్పుడు ఇదొక ప్రధానమైన చర్చ. ఒక దళిత యువతి అత్యంత అమానుషమైన హత్యాచారానికి గురైతే- ఆ విషయాన్ని ప్రపంచంలో దృష్టిలోకి రాకుండా ఏకంగా పోలీసులే శాయశక్తులా ప్రయత్నించటం దేశాన్ని నివ్వెరపరిచింది. ఇంతకీ ఈ ఊళ్లో ఏం జరుగుతోంది?
దేశంలో ఎక్కడో మారుమూల ఉన్న గ్రామం ఉత్తర ప్రదేశ్‌లోని హథ్రాస్‌ గ్రామం. అక్కడ జరిగిన అన్యాయం గురించి ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా మాట్లాడింది. సిగ్గుతో తలదించుకొని అన్యాయాన్ని సరిదిద్దాల్సిన పాలకులు మా విషయంలో బయటివారు మాట్లాడడం ఏంటని అధికారంలో ఉన్న బిజెపి పెద్దలు దేశ గౌరవం గురించి మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్ల పరువునీ, ప్రాణాన్నీ దారుణంగా తగులబెట్టాక, దానిని నిరసించబోతే కేసులూ లాఠీలతో విరుచుకుపడ్డాక- మాట్లాడ్డానికి వీళ్లకి ఇంకా పరువు మిగిలి ఉందా?
హథ్రాస్‌ గ్రామంలో తాము అధికులం అనుకునే ఠాకూర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాతి సంఖ్యాబలం బ్రహ్మణులది. ఓ నాలుగు దళిత కుటుంబాలు ఉన్నాయి. అందులో మానస వాల్మికీ కుటుంబం ఒకటి. ఈ దళిత కుటుంబాలే ఆ ఊరి మురికిని పారబోయాలి. చెత్తను ఊడ్వాలి. ఈ పని చేస్తున్నందుకు ఆ కుటుంబాలు ఊరికి దూరంగా వెలివేసినట్లుగా ఉంటున్నాయి. వారు ఒక్కరోజు పనిలోకి రాకపోయినా వేధింపులు తప్పవు. పిల్లలు, పెద్దలు అన్న తేడా ఉండదు. అందరూ ఆ ఊరిలో ప్రతి ఒక్కరికీ సేవకులే.. లోకువే. అటువంటి కుటుంబంలో ఆడపిల్లగా పుట్టడమే మానస చేసిన తప్పు. వ్యవసాయ పనికి వెళ్లి దారుణ హత్యాచారానికి గురైంది. సెప్టెంబరు 14న మానసపై జరిగిన అమానవీయ ఘటనతో ఉలిక్కిపడిన ఆ కుటుంబాలకు ఇప్పుడు గ్రామపెత్తందారుల నుంచే కాక రాష్ట్ర నాయకుల నుంచి కూడా బెదిరింపులు తప్పడం లేదు. పెత్తందారులు, పోలీసులు, నాయకులు ఒక్కతాటి మీదకు వచ్చారు. వారంతా ఏకమై నిందితులను రక్షించేందుకు సామధాన భేద దండనోపాయాలు ప్రయోగిస్తున్నారు.
14 రోజులు మృత్యువుతో పోరాడిన మానస అలిసిపోయింది. శరీరం మీద గాయాల కంటే మనసులో ఏర్పడిన భయమే ఆమెను మృత్యువుకు చేరువ చేసి ఉండొచ్చు. అంతగా ఆమె కంపించిపోయింది. జంతువుల కంటే వికృతంగా విరుచుకుపడుతున్న మృగాలకు బలైన లేడిపిల్ల మానస. మరణించిన బిడ్డ కడసారి చూపు కూడా కన్నవారికి దక్కకుండానే మంటల్లో మసైపోయింది. ''దారుణం జరిగి రెండు వారాలైంది. వైద్యులు ప్రాథమిక నివేదిక తీసుకోవడంలో చూపిన అలసత్వం వల్ల సాక్ష్యాలు తారుమారు చేయవచ్చు. పోస్టుమార్టం నివేదిక లేకుండా శరీరాన్ని మసి చేసేశాం. కాబట్టి మన బిడ్డలు నిందితులు కాదని నిరూపించుకోవచ్చు' అని ఆ ఊరి పెత్తందారుల గుంపు చర్చలు జరిపింది. రాత్రికి రాత్రే నిందితులకు రక్షణగా ర్యాలీలు చేసింది. నేరం చేసిన వాడు ఇంత బరితెగించి 'నేను నిర్దోషిని' అని అరిచేంత సాహసం ఎలా చేస్తాడు? అతనికి ఆ బలం ఇచ్చింది ఎవరు? నివేదికలు సాక్ష్యాలను తారుమారు చేస్తున్నదెవరు? ఒకపక్క ఆందోళన జరుగుతుండగానే పోలీసు పెద్దలు అసలు అత్యాచారమే జరగలేదని వ్యాఖ్యానం ఎందుకు చేశారు? రాత్రికి రాత్రే ఏ భయం చేత బాధిత యువతి మృతదేహాన్ని కాల్చేశారు? ఏకంగా జిల్లా కలెక్టరే వచ్చి బాధిత కుటుంబాన్ని ఎందుకు బెదిరించాడు? ఈ వెనక అధికారిక పెద్దలు ఉండడం వల్లే ఇదంతా జరుగుతుందని ఇప్పుడు దేశం కోడై కూస్తోంది. కామాంధులను రక్షించేందుకు మనువాదులందరూ ఏకమైన దృశ్యం అనేక ప్రజాస్వామిక విలువలను కర్కశంగా కాలరాస్తోంది.
మానస చితికి నిప్పంటించడం, అక్కడి దృశ్యాలను చిత్రీకరించడం, ఆ కుటుంబాలకు అండగా నిలబడడం, ఈ ఘటనను ప్రపంచానికి తెలియజేయడమే నేరాలుగా పరిగణించిన యు.పి ప్రభుత్వం ... అలాంటివారందరినీ అరెస్టులు చేయించింది. బాధిత మహిళ కుటుంబానికి రూ.50 లక్షల ఆశచూపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమని వారు చెప్పారని సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తోంది. పొలం పనికి వెళ్లిన పిల్ల రక్తమోడుతూ వివస్త్రగా పడి ఉండడం, 14 రోజులు మృత్యువుతో పోరాడి, చనిపోవటం ా ఆ కుటుంబాన్ని తీవ్ర దు:ఖానికి గురి చేస్తాే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ... ఆ కుటుంబం గుండెకోతకు వెల కడుతోంది. నోర్మూసుకొమ్మని భయపెడుతోంది. స్వాతంత్య్ర భారతంలో ఎంత దౌర్జన్యకర దుర్మార్గం ఇదీ!