కారకాస్ : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్ ఒర్టెగా రష్యాకు మద్దతు ప్రకటించారు. రష్యాలో వాగర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటును ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. హింసాత్మక మరియు రాజ్యాంగ విరుద్ధ మార్గాల ద్వారా అధికార మార్పు లేదా సాయుధ తిరుగుబాటును తాము తిరస్కరిస్తామని వెనిజులా ఓ ప్రకటనలో పేర్కొంది. రష్యా సార్వభౌమాధికారం మరియు స్వయం నిర్ణయాధికారంపై దాడి చేయడాన్ని తిరస్కరిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. వెనిజులా అధ్యక్షుడు సహా పలువురు ప్రతినిధులు ఈ ప్రకటనను తమ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. శాంతి, స్థిరత్వం మరియు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన ఈ దాడిని ఎదుర్కొనేందుకు రష్యా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు రష్యా ప్రతిష్ట, స్వభావం, విలక్షణత, బలానికి సవాళ్లు ఎదురవుతున్నట్లు ఉన్నాయని నికరాగ్వా అధ్యక్షుడు ఒర్టెగా తెలిపారు.










