విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విశాఖలోని టీడీపీ కార్యాలయంలో అఖిలపక్షం సమావేశమైంది. ఈ సందర్భంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అరాచక పాలనను ఎదుర్కొంటామని తెలిపారు. సమన్వయంతో పని చేసి వైసీపీ పాలనకు రాజకీయ సమాధి కడతామన్నారు.ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏపీలో అప్రజాస్వామిక విధానాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. 16 నెలలు జైల్లో ఉండి ఆర్ధిక నేరగాడిగా ముద్రపడ్డ జగన్.. చంద్రబాబును కూడా జైల్లో పెట్టాలనే అక్కసుతో వ్యవహరించారని అన్నారు. పొత్తులకు సమయం ఉన్నపట్టికీ దమ్మూ ధైర్యంతో స్నేహ హస్తం ఇచ్చారన్నారు. చంద్రబాబు అరెస్టైన రోజు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వస్తోన్న సమయంలో విమానం ల్యాండింగ్ కాకుండా అనేక ప్రయత్నాలు చేశారన్నారు. ఒక మేజర్ అంశం నడుస్తున్నప్పుడు దాన్ని దృష్టి మళ్లించడం జగన్‌కు తెలుసని విమర్శించారు. 25 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించారన్నారు. స్థానిక అంశాలపై దఅష్టి పెట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని హితవుపలికారు. ఒక్క ఛాన్స్ పూర్తయ్యే సమయం దగ్గర పడుతోందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సమావేశానికి టీడీపీ , జనసేన , సీపీఐ నేతలు హాజరయ్యారు.










