ఇసుక దోపిడీపై సత్యాగ్రహం పేరిట పోరాటం
టిడిపి శ్రేణులకు చంద్రబాబు పిలుపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ ' పేరుతో సెప్టెంబరు 1 నుంచి 45 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లాలని టిడిపి శ్రేణులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. టిడిపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం పార్టీ ఇన్‌చార్జీలు, కీలకనేతలతో పార్టీ విస్తృత స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. బూత్‌ల వారీగా రోజుకు 10 ఇళ్ల చొప్పున తిరగాలని అదే సమయంలో యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జీలు ప్రతి ఇంటికి వెళ్లి జరిగే కార్యక్రమాన్ని పరిశీలించాలన్నారు. '' ప్రజావేదిక'' అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ఇన్‌చార్జీలు ప్రతి మండల, పట్టణ, నగర ప్రధానకేంద్రాల్లో పాదయాత్ర చేసి, డోర్‌టు డోర్ ప్రచారం చేయాలన్నారు. అదే సందర్భంలో ఆయా ప్రాంతాల్లో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఈ కార్యక్రమం ద్వారా తాము ఏమి చేయబోతున్నామో తెలియజేస్తూ ప్రజలకు ఒక నమ్మకం కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాను స్వయంగా 35 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు. ఇంటింటికీ తిరిగే సమయంలో వైసిపి ప్రభుత్వం అప్పుల కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. ఇసుక దోపిడీపై నిలదీస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేదని, రాబోయే రోజుల్లో ఇసుక సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వెంకటేశ్వరస్వామిని అప్రతిష్టపాలు చేసేందుకు లిక్కర్ స్కామ్‌లో నేరాన్ని ఒప్పుకున్న వ్యక్తిని టిటిడి సభ్యునిగా నియమిస్తారా? అని ప్రశ్నించారు. బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు ప్రత్యేక సబ్‌ప్లాన్ అమలు చేస్తామని నేతలు ప్రజలకు వివరించాలన్నారు. రాజకీయ రౌడీలను తుదముట్టించే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, పార్టీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకటరావు, తెలుగు మహిళాధ్యక్షురాలు వంగలపూడి అనిత, గోళ్ల బుచ్చయ్య చౌదరి, వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు.










