Sep 27,2023 15:30

ప్రకాశం: తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై మాజీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ నన్నపనేని రాజకుమారి విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని చంద్రబాబు అభివఅద్ధి చేశాడని కేటీఆర్‌ గతంలో అన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ర్యాలీకి అనుమతించాలని కేటీఆర్‌ను లోకేశ్‌ అడిగారని.. హైదరాబాద్‌లో మీకేం పని అని కేటీఆర్‌ అనడం దారుణమని మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై ఏపికి ఇంకా హక్కు ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు చేస్తున్నారన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చెల్లెలు షర్మిల.. కేసీఆర్‌ను రోజూ తిడుతుందని... తెలంగాణలో మీకేం పని షర్మిలాని అన్నారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వంతో బీఆర్‌ఎస్‌ కలిసిపోయిందా అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ మీటింగ్‌లు ఏపీలో కూడా పెట్టారని తెలిపారు. ఏపీలో బీఆర్‌ఎస్‌కు ఏం పని అని తాము అడగలేదన్నారు. ఒరిస్సా, మహారాష్ట్రా వెళ్లి కేసీఆర్‌ ధర్నాలు ఎలా చేశాని అడిగారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నన్నపనేని రాజకుమారి డిమాండ్‌ చేశారు.