Oct 26,2023 14:28

కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటిలో టిడిపి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇచ్ఛాపురంలో గురువారం వైసిపి చేపట్టనున్న సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కవిటిలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే అశోక్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసిపి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను అణచివేస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతోనే సామాజిక సాధికార యాత్ర పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యేను పోలీసుల అరెస్ట్‌ చేసి కవిటి పీఎస్‌కు తరలించారు. ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ టిడిపి నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని ఖండించారు.