రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టిడిపి నేత గంటా నరహరి చేపట్టిన.. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితుల పరామర్శ యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రాజెక్టు బాధిత గ్రామాల పర్యటనకు బయల్దేరిన ఆయనను పోలీసులు అరెస్టు చేసి రాజంపేట ఠాణాకు తరలించారు. తొలుత గతరాత్రి నుంచే ఆయనను గఅహనిర్బంధం చేయడంతో.. పోలీసులు, టిడిపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ.. రెండేళ్లుగా ప్రాజెక్టు బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయలేదని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలని అడిగితే అరెస్టు చేస్తారా?అని ప్రశ్నించారు. జగన్ సర్కార్ అన్ని వర్గాలను అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుందని దుయ్యబట్టారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు తెదేపా అండగా ఉంటుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.