ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్యుత్ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏకపక్ష ప్రయత్నాలను నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ (ఎన్‌సిసిఒఈఈఈ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు మంగళవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఎన్‌సిసిఒఈఈఈ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల జాతీయ సదస్సు జరిగింది. విద్యుత్ ఉద్యోగులకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. క్విట్ ఇండియా ఉద్యమ 80వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 9న బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. సవివరంగా చర్చించకుండా విద్యుత్ చట్టం 2003ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు 2022ను పార్లమెంటు ఆమోదించుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న 27 లక్షల మంది విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు వెంటనే పనిని నిలిపివేస్తామని స్పష్టం చేసింది.










