న్యూఢిల్లీ : ''దళితుడివైన నువ్వు సంస్కృతం బోధిస్తావా'' అంటూ ఓ ఉపాధ్యాయుని కాలేజీ ప్రిన్సిపల్, తోటి ఉపాధ్యాయులు వేధింపులకు గురిచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. కొందరు క్షత్రియ ఉపాధ్యాయులు కొందరు ప్రత్యేక బృందంగా ఏర్పడి తనపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని అభయ్ కుమార్ కోరి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
దళిత కుటుంబంలో పుట్టడం, అందులోనూ భారత్‌లో దళితుడిగా జన్మించడం ఒక శాపమని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతం నేర్పడం అగ్రకులాల జన్మహక్కా, దళితులు బోధించడం తప్పా అని మండిపడ్డారు. సంస్కృతం బోధిస్తున్నందుకు ఇతర ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ తన జడ పట్టుకుని లాగడంతో పాటు మానసికంగా వేధింపులకు గురిచేశారని కోరి పేర్కొన్నారు.
2018లో బారాబంకిలో ఉపాధ్యాయునిగా పోస్టింగ్ వచ్చినప్పటి నుండి కుల వివక్షను ఎదుర్కొంటున్నానని అన్నారు. పసుపు రంగు కుర్తా, కుంకుమ రంగు ధోతి ధరించడంతో పాటు జుట్టును చిన్న పిలకలాగా వేసుకోవడం తనకు అలవాటని అన్నారు. అయితే ప్రిన్సిపల్ తన వస్రథారణను వ్యతిరేకించారని, దళితులకు పిలక ఉండకూడదంటూ తన పిలకను కత్తిరించారని అన్నారు. మాతో సమానంగా ఉండేందుకు యత్నించ కూడదంటూ తనను కుర్చీలో కూర్చోనీయడం లేదని అన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని చెప్పారు.
క్షత్రియ వర్గానికి చెందిన కొందరు ఉపాధ్యాయులు పుస్తకాలను లాక్కుని , విద్యార్థుల ముందే తనను కొట్టారని చెప్పారు. దీంతో కొన్ని రోజుల పాటు పాఠశాలకు వెళ్లలేదని అన్నారు. 2021లో తనపై తప్పుడు కేసు బనాయించి సస్పెండ్ చేయించారని, ఆ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని.. జిల్లా ఇన్‌స్పెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారని అన్నారు.










