- బిజెపితో వెళ్లే అంశంపై చంద్రబాబు, పవన్ పునరాలోచించాలి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విశాఖపట్నంలో 19,703 ఎకరాల్లో విస్తరించి ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో 1400 ఎకరాలు అమ్మాలని కేంద్రం నిర్ణయించిందని, దాన్ని దక్కించుకోవడానికే అదానీ సిఎం జగన్‌తో భేటీ అయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. శనివారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌లో ఉన్న భూములను విక్రయించాలని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ అమిత్‌గుప్తాకు కేంద్రం బాధ్యతలు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్, అదానీ భేటీ జరిగిందని తెలిపారు. భూములు తీసుకున్న అదానీ క్విడ్‌ప్రోకో ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి రూ.1400 కోట్లు ఇవ్వనున్నారని ఆరోపణలస్తున్నాయన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే లౌకిక రాజ్యానికి విఘాతం కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని తెలిపారు. అంగన్‌వాడీల నుంచి ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారని చెప్పారు. మోడీ, అమిత్ షా సహకారం లేనిదే చంద్రబాబును అరెస్టు చేయడం జరగదన్నారు. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగానే తాము భావిస్తున్నామన్నారు. బిజెపితో కలిసి వెళ్లాలని భావిస్తున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మరోసారి ఆలోచించాలని సూచించారు. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో జగన్‌ను గద్దెదించే లక్ష్యంతో పని చేస్తున్న తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకెళతామని చెప్పారు. పోలీస్ ఉద్యోగార్థుల మెయిన్స్ పరీక్షలకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని, కోర్టు కేసుల పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ డిజిపికి రామకృష్ణ లేఖ రాశారు.










