Jul 01,2023 11:10
  • మణిపూర్‌లో బిజెపి పొలిటికల్‌ మైండ్‌గేమ్‌ 
  • సిఎం రాజీనామా అంటూ వార్తలు
  • అలాంటిదేమీ లేదని బీరెన్‌సింగ్‌ ట్వీట్‌

ఇంఫాల్‌ : మణిపూర్‌లో కల్లోలాన్ని అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ శుక్రవారం రాజీనామా పేరుతో సరికొత్త డ్రామాకు తెర లేపారు. ఆయన రాజీనామా లేఖను టైపు చేయించి, గవర్నరుకు అందజేయడానికి రాజ్‌భవన్‌కు కారులో వెళ్తుండగా, విషయం తెలుసుకున్న ఆయన మద్దతు దారులు చుట్టుముట్టి రాజీనామా చేయొద్దని కోరడం, ఆ వెంటనే తాను రాజీనామా చేయడం లేదని ముఖ్యమంత్రి ప్రకటించడం అన్నీ నాటకీయ ఫక్కీలో చకచకా జరిగిపోయాయి. గవర్నర్‌ నివాసానికి 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి మధ్యాహ్నం 2 గంటలకు బీరెన్‌సింగ్‌ బయలుదేరారు. అయితే, సీఎం రాజీనామా చేయొద్దంటూ బీరెన్‌సింగ్‌ ఇంటి బయట మహిళలు నిరసన చేశారనీ, దీంతో తాము వెనుదిరగాల్సి వచ్చిందని రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు.రాజీనామాపై పునరాలోచించుకోవాలని బీరెన్‌ సింగ్‌ను కోరామనీ, రాజీనామా చేయకుండా బీరెన్‌సింగ్‌ను ఒప్పించి ఆ విషయాన్ని బయటకు వచ్చి ప్రజలకు చెప్పామని మంత్రి సపమ్‌ రంజన్‌ సింగ్‌ తెలిపారు. గవర్నర్‌కు సమర్పించాల్సిన రాజీనామా లేఖను నిరసనకారులకు చదివి వినిపించామనీ, దానిని వారు చించేశారని చెప్పారు. ఇటు బీరెన్‌ సింగ్‌ కూడా ప్రస్తుత కీలక తరుణంలో తాను రాజీనామా చేయబోనని ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు. చిరిగిపోయిన సీఎం రాజీనామా లేఖ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది.
         అయితే, మరోవైపు ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ రాజీనామా వార్త ఒక మైండ్‌గేమ్‌ అని సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు కొట్టిపారేశారు. మణిపూర్‌లో చోటు చేసుకున్న పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే బిజెపి ఇలా రాజీనామా అంటూ కొత్త నాటకానికి తెరలేపిందని ఆరోపించారు. రాజకీయంగా ఆ పార్టీ మైండ్‌గేమ్‌ ఆడుతున్నదని విమర్శించారు. హింసాకాండకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.