Jul 11,2023 10:35
  • అక్టోబరులో ఏడు రోజులు నాటకోత్సవాలు
  • ఫిల్మ్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి విజయ్ కుమార్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నంది నాటకోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది 5 విభాగాల్లో 73 అవార్డులను ప్రదానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనరు, ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి టి విజరుకుమార్‌ రెడ్డి తెలిపారు. నంది నాటకోత్సవాలు, నిర్వహణ అంశంపై పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లోని ఆర్‌టిసి కాన్ఫరెన్స్‌ హాల్‌లో పలువురు నాటక రంగం ప్రముఖులతో సోమవారం సలహాలు, సూచనలు స్వీకరించారు. అక్టోబరులో ఏడు రోజులపాటు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విజరుకుమార్‌ రెడ్డి తెలిపారు. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల ప్లేలెట్‌లు, కళాశాల, యూనివర్సిటీ ప్లేలెట్‌లు ఐదు విభాగాల్లో అవార్డులు అందజేయాలని పేర్కొంటూ ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని చెప్పారు.
           రాష్ట్ర వ్యాప్తంగా 2018 నుంచి 2022 వరకు వివిధ నాటక సమాజాల నుండి ప్రదర్శించిన నాటకాలను ఈ ఏడాది నిర్వహించే నంది నాటకోత్సవాల్లో ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. బాలలు, యువత నాటకాలకు సంబంధించి ఈ ఏడాది కొత్తగా ప్రదర్శించిన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కళాకారులకు ఆర్‌టిసి ఛార్జీల రాయితీ విషయాన్ని సంబంధిత విభాగంతో చర్చిస్తామన్నారు. రాష్ట్ర చలనచిత్ర, టివి, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ ఎంవిఎల్‌ఎన్‌ శేషసాయి మాట్లాడుతూ.. నంది నాటకోత్సవాల్లో భాగంగా ఆరు రోజులు పోటీలు నిర్వహించి ఏడో రోజు అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని అన్నారు. కళారాధన సమితి కార్యదర్శి రవికృష్ణ నంద్యాల మాట్లాడుతూ.. నంది నాటకోత్సవ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్‌ బుర్రా మాట్లాడుతూ.. అనేక కారణాలతో వాయిదా పడిన నంది నాటకోత్సవాలను ఐదేళ్ల తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమన్నారు. నంది నాటకోత్సవాలను తెనాలిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎన్‌టిఆర్‌ సాఫల్య పురస్కారంతో సమానంగా బళ్లారి రాఘవ అవార్డుకు కూడా గౌరవం ఇస్తే బాగుంటుందని సూచించారు. 'తెలుగు పద్యనాటక రంగం- సాంకేతికత- సమకాలీన అధ్యయనం' అంశంపై ఆర్‌ నిరుపమ సునేత్రి రచించిన పుస్తకాన్ని విజరుకుమార్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాటక రంగ ప్రముఖులు, ఎఫ్‌డిసి, కల్చరల్‌ విభాగం, సమాచార, పౌర సంబంధాలశాఖ అధికారులు పాల్గొన్నారు.