- నయానో భయానో దారికి తెచ్చుకోవడానికి కమలం ఒత్తిళ్లు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళన నిర్వహిస్తున్న మల్లయోధులపై రాజీ చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుంది. రెజ్లర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకుని వస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఆందోళన చేస్తున్న రెజ్లర్లలో ఎక్కువ మంది జాట్ కులానికి చెందిన వారు. ఈ జాట్ల ప్రాబల్యం కేవలం హర్యానాకే పరిమితం కాదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌తో పాటు ఢిల్లీలో కొంతమేర వీరు నిర్ణయాత్మక శక్తిగా కొనసాగుతున్నారు. ఈ నాలుగు రాష్ట్రాలలోని 40 లోక్‌సభ స్థానాలలో, వాటి పరిధిలోని 160 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల జయాపజయాలను తారుమారు చేసే బలం వీరి సొంతం. కర్ణాటక ఓటమితో దక్షిణాది రాష్ట్రాలపై పూర్తిగా పట్టు కోల్పోయిన బిజెపి, ఉత్తరాదిలోనూ వ్యతిరేకతను మూటకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో రెజ్లర్లను బెదిరించి లేదా ఒత్తిళ్లతోనూ వారిని దారికి తెచ్చుకోవడం మినహా మరో మార్గం లేదని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నిరసన విరమించాలని, రాజీ చేసుకోవాలని రెజ్లర్లకు బెదిరింపులు వస్తున్నాయి. బ్రిజ్ భూషణ్‌పై తొలుత ఆరోపణలు చేసిన మైనర్ రెజ్లర్ ఆ తర్వాత మాట మార్చడానికి ఈ ఒత్తిడే కారణమని ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ తెలిపారు. రాజీ చేసుకోవాల్సిందిగా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోందని ఆమె ఓ టెలివిజన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బ్రిజ్ భూషణ్ సన్నిహితులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సిందిగా మైనర్ రెజ్లర్ తండ్రిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని, దీంతో ఆయన మానసిక ఒత్తిడికి లోనయ్యారని సాక్షి మాలిక్ తెలిపారు. హర్యానాలోని సోనేపట్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రెజ్లర్లు రోజురోజుకూ మానసికంగా ఎంతగా కుంగిపోతు న్నారో ఎవరికీ అర్థం కావడం లేదని వాపోయారు. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి రెజ్లర్లు ఏర్పాటు చేసిన మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు ఆమె సోనేపట్ వచ్చారు.
సమస్యను పూర్తిగా పరిష్కరించని పక్షంలో ఆసియా క్రీడలలో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఆసియా క్రీడల కోసం ఈ నెలలో ట్రయల్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సాక్షి మాలిక్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. నిరసనలో పాల్గొంటున్న రెజ్లర్లు ఆందోళన విరమించి, ఈ ట్రయల్స్‌కు హాజరై ఆసియా క్రీడల జట్టులో స్థానం సంపాదించాల్సి ఉంటుంది. చైనాలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకూ ఆసియా క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ పూర్తి కావడానికి ఈ నెల 15 వరకూ సమయం ఇవ్వాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తమను కోరినట్లు రెజ్లర్లు నాలుగు రోజుల క్రితం తెలిపారు.
బిజెపికి ఓటమి భయం
రెజ్లర్లలో ఎక్కువ మంది జాట్ కులానికి చెందిన వారు ఉండడంతో వారి ప్రభావం నాలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలపై ఉండబోతోంది. జాట్ల మద్దతుతోనే ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి రాగలిగింది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో పరిస్థితి మారుతోంది. 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఆర్‌ఎల్‌డీ ఎనిమిది స్థానాలు గెలిచింది. ఇవన్నీ జాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న స్థానాలే. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలోనూ జాట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట ఆర్‌ఎల్‌డీ, దాని మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ గణనీయమైన విజయాలు సాధించింది. మరోవైపు ఆయా ప్రాంతాలలో బిజెపి చతికిలపడింది. జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాలలో ఆ పార్టీ 20 నగరపాలిక ఛైర్మన్ స్థానాలను (మొత్తం 56 స్థానాలు), 34 నగర పంచాయత్ ఛైర్మన్ స్థానాలను (మొత్తం 124 స్థానాలు) మాత్రమే పొందగలిగింది. పశ్చిమ యూపీలోని 12 లోక్‌సభ స్థానాలు, 40 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి జాట్లకు ఉంది. మొత్తంగా చూస్తే ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలలోని 40 లోక్‌సభ స్థానాలు, 160 అసెంబ్లీ స్థానాలలో జాట్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. యుపి 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జాట్ల ఓట్లు పార్టీలవారీగా చీలిపోయాయి. రెజ్లర్ల ఆందోళనతో జూట్ల అంతా 2024 సాధారణ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని, దీంతో తమకు ఓటమి తప్పదని బిజెపి నాయకులు భయపడుతున్నారు.










