కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ నిబంధనలను, సంప్రదాయాలను కాలరాసి వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులను ఆమోదింపజేసుకొని రైతులకు మరణ శాసనం రాసింది. ప్రతిపక్షాల నిరసనలను, రైతుల ఆందోళనలను, చివరికి స్వపక్షం ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీల అభ్యంతరాలను సైతం పెడచెవిన పెట్టింది. వ్యవసాయ సంక్షోభం, ఆపై ఆర్థిక మాంద్యం, వాటికి తోడైన కరోనా విలయం కట్ట కట్టుకొని రైతులపై ముప్పేట దాడి చేస్తున్న సమయాన, కర్షకులను రెండు చేతులా ఆదుకోవాల్సిన మోడీ సర్కారు, అందుకు విరుద్ధంగా 'ఆత్మ నిర్భర్' పేరుతో రెండు దుర్మార్గమైన ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చట్ట రూపం కల్పించే బిల్లులు ప్రతిపాదించింది. ఒకటి రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డుల్లోనే అమ్ముకోవాలనే నిబంధనను తొలగించే బిల్లు, రెండు పంట వేయడానికి ముందే వ్యవసాయోత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు రక్షణ బిల్లు. ఆ కోవలోనివే పలు రకాల నిత్యావసర వస్తువుల నిల్వలపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసే బిల్లు, ఆర్‌బిఐ పరిధి లోకి సహకార బ్యాంకులను తీసుకొచ్చే బిల్లు. నిత్యావసర, సహకార బిల్లులపై ప్రతిపక్షాల నుంచి ఒక స్థాయిలో నిరసనలు వ్యక్తంకాగా, వ్యవసాయ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ప్రతిపక్షాలే కాదు, ఎన్‌డిఎ లోని శిరోమణి అకాలీదళ్‌కు చెందిన కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ రాజీనామా చేసినా, హర్యానా బిజెపి ప్రభుత్వంలో మిత్రపక్షం జెజెపి ఎంఎల్‌ఎలు రోడ్డెక్కినా మోడీ సర్కారు వెనక్కి తగ్గలేదు సరికదా తనకు బలం లేని రాజ్యసభలో, ఒక వైపు సభ్యులు ఓటింగ్‌కు, సెలెక్టు కమిటీకి డిమాండ్ చేసినా వినకుండా, విపక్షాలపై బల ప్రయోగం చేసి మూజువాణి ఓటుతో బిల్లులు గట్టేక్కేలా పక్కా పథకం అమలు చేసింది. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యానికి సమాధి కట్టింది.
కేంద్ర ఆర్డినెన్స్‌లే ఏకపక్షం. వ్యవసాయం రాష్ట్రాల సబ్జెక్టు అయినా రాష్ట్రాలను సంప్రదించకుండా ఆర్డినెన్స్‌లు తేవడం సమాఖ్య వ్యవస్థకు విఘాతం. బిల్లులపై చర్చ సమయంలోనూ ప్రతిపక్షాల అభ్యంతరాలను కేంద్రం ఖాతరు చేయలేదు. సభ్యుల గొంతు నొక్కింది. బిల్లులు పాసయ్యే సమయంలో అధ్యక్ష స్థానంలో ఉన్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రఘువంశ్ వ్యవహరించిన తీరు జుగుప్సాకరం. సభ్యుల ఓటింగ్ హక్కును తిరస్కరించడం సభా నిబంధనలకు విరుద్ధం. అందుకే రఘువంశ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చాయి. రఘువంశ్ తీరుపై విచారించాల్సిన ఛైర్మన్ వెంకయ్య నాయుడు, ఎనిమిది మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయం. వ్యవసాయ బిల్లులు రెండూ ప్రధాని చెబుతున్నట్లు రైతులకు స్వేచ్ఛను కల్పించవు. రైతులను కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు బానిసలుగా మారుస్తాయి. కాంట్రాక్టు, కంపెనీ సేద్యం దూకుడు పెంచుతాయి. రైతులకు ఇప్పుడు కనాకష్టంగానైనా దక్కుతున్న కనీస మద్దతు ధర దక్కదు. ఆహార భద్రతకు ముప్పు తెస్తాయి. వ్యవసాయ రంగానికి, రైతులకు, ప్రజలకు నష్టం చేసే బిల్లులను కేంద్రం మంకు పట్టుదలతో తేవడానికి వెనుక కార్పొరేట్ల ఆశ్రితపక్షపాతం స్పష్టం.
రైతుల జీవనాధారాన్ని తుంచేసే, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే బిల్లులను మన రాష్ట్రం లోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి బేషరతుగా మద్దతివ్వడం ఆ పార్టీల అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. తెల్లారి లేస్తే తమది రైతు ప్రభుత్వమని భుజకీర్తులు తగిలించుకొని ఊరేగుతున్న వైసిపి...కేంద్రంలో బిజెపితో అంటకాగేందుకు, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు వెనుకాడక పోవడం ఆందోళనకరం. రాష్ట్రాల హక్కులను, రైతులను నట్టేట ముంచే బిల్లులపై ఏ కొంచెం అభ్యంతరాల్లేకుండా మద్దతివ్వడం దారుణం. ఉచిత విద్యుత్ మీటర్ల విషయంలోనూ అందరి కంటే ముందు నిలిచింది. పొరుగు తెలుగు రాష్ట్ర టిఆర్‌ఎస్, ఎన్‌డిఎ లోని అకాలీదళ్, జెజెపి లకు రైతు ప్రయోజనాలపై ఉన్న స్ప్రుహ వైసిపి కి లేకపోవడం ఆ పార్టీ దివాళాకోరుతనాన్ని సూచిస్తుంది. రైతులకు వైసిపి ద్రోహం చేస్తోందంటూ హూంకరించే టిడిపి సైతం పార్లమెంట్‌లో బిల్లులకు జైకొట్టడం ఆక్షేపణీయం. జాతికి అన్నం పెట్టే రైతులను కన్నీరు పెట్టించే రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను రైతులు, ప్రజలందరూ ఏకోన్ముఖంగా అభిశంసించాలి, ఖండించాలి. ప్రతిఘటనోద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రభుత్వాలకు గుణపాఠం నేర్పాలి. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని చాటాలి.










