Jul 11,2022 21:21

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపును నిరసిస్తూ విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. తక్షణమే మీటర్లను తొలగించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు కలెక్టర్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ఎస్‌ఇ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ మాట్లాడుతూ..రాప్తాడు మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు బిగించిన విద్యుత్‌ మీటర్లను తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి వారిపై భారాలు మోపడం సరికాదన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మీటర్ల బిగింపు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఇ పి.నాగరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాలరంగయ్య, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.