Jul 28,2023 21:45

- ఆర్‌డిఒ కార్యాలయం వద్ద అఖిలపక్ష పార్టీల ఆందోళన
ప్రజాశక్తి-కడప అర్బన్‌ :కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆర్థికంగానూ, సాంకేతికంగానూ సాధ్యం కాదని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి నిత్యానందరారు లోక్‌సభలో హంకారపూరిత ప్రకటన చేస్తే అడగలేని వైసిపి ఎంపిలు తక్షణం రాజీనామా చేయాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కడప ఆర్‌డిఒ కార్యాలయం వద్ద వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అలీఖాన్‌, బిఎస్‌పి నాయకులు గురప్ప, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్‌ శ్రీనివాసులు, బిసి మహాసభ నాయకులు అవ్వారు మల్లికార్జున, సంఘ సేవకులు సలావుద్దీన్‌, జనతాదళ్‌ నాయకులు ప్రతాపరెడ్డి, ఎంఆర్‌ఎఫ్‌ నాయకులు దస్తగిరి, సిపిఎం సిపిఐ నగర కార్యదర్శులు రామమోహన్‌, ఎన్‌.వెంకటశివ మాట్లాడారు.. కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారన్నారు. కడప ఉక్కు పరిశ్రమ రాష్ట్ర విభజన చట్టంలో చేర్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం విభజన హామీలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా విభజన హామీలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు.