Jun 17,2022 20:00

-వ్యవసాయ కమిషనరేట్‌ వద్ద నిరసన
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :గతేడాది ఖరీఫ్‌లో పంటలు దెబ్బతిన్న రైతులందరికీ బీమా పరిహారం ఇవ్వాలని, ఈ క్రాప్‌ బుకింగ్‌ జరగని రైతులను గుర్తించి వారికీ బీమా అందించాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులోని వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, కౌలు రౌతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ నిరసనలో పాల్గని మాట్లాడుతూ ఉచిత పంటల బీమా పథకంలో కౌలు రైతులకు అన్యాయం జరిగిందని, వారికి బీమా పరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు. తామర తెగులుతో నష్టపోయిన మిర్చి రైతుల్లో కొందరికి స్వల్పంగా ఎక్కువ మందికి అసలు పరిహారమే అందలేదని తెలిపారు. 2021లో ఖరీఫ్‌లో పంటలు దెబ్బతిన్న రైతులందరికీ బీమా పరిహారమివ్వాలని, ఈ క్రాప్‌ కాని రైతులకు వాస్తవసాగుదారులకు తిరిగి అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 30 లక్షల మంది రైతులకు నష్టం జరిగితే 16 లక్షల మందికి పరిహారం ఇవ్వడం దారుణమన్నారు. బీమా చెల్లింపుల్లో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. పసుపు రైతులకు ఎకరాకు రూ.45 వేలు ఇవ్వగా మిర్చి రైతులకు రూ.4,160 మాత్రమే ఇచ్చారని తెలిపారు. బీమా పరిహారంలో పసుపు, మిర్చి రైతులకు తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు. ప్రదర్శనలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బైరగాని శ్రీనివాసరావు,. ఎం.హరిబాబు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జన్నా శివశంకరరావు పాల్గొన్నారు.