Sep 16,2020 15:45


కమ్యూనిస్టు చిహ్నాలుగా పరిగణిస్తున్న సుత్తి, కొడవలి, నక్షత్రం కమ్యూనిస్టు భావజాలం పురుడు పోసుకోక ముందే ఉన్నాయి. సుత్తి, కొడవలిని కార్మికాకర్షక మైత్రికి, నక్షత్రాన్ని ఐదు భూ ఖండాలకు గుర్తుగా కార్మికవర్గంపై జరిపిన దాడిలో పారిన రక్తానికి చిహ్నంగా ఎర్రజెండాను కమ్యూనిస్టులు స్వీకరించారు. వాటి మీద కమ్యూనిస్టులకేమీ పేటెంట్‌ హక్కు లేదు. అయితే ఆ చిహ్నాలను వినియోగించిన వారికి పది నుంచి పదిహేనేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని కోరుతూ సెప్టెంబరు రెండవ తేదీన బ్రెజిల్‌ పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో కుమారుడు, పార్లమెంట్‌ సభ్యుడు అయిన ఎడ్వర్డ్‌ బోల్జానో దాన్ని ప్రతిపాదించాడు. వాటిని తయారు చేసినా, విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షార్హంగా పరిగణిస్తూ చట్టసవరణకు నిర్ణయించారు. నాజీలు, తరువాత కమ్యూనిస్టులు పోలాం డ్‌ను ఆక్రమించారని అందువలన వారిని హంతకులుగా పరిగణించాలని, వారి చిహ్నాలను ఉపయోగించిన వారిని శిక్షించాలని బోల్జానో చెప్పాడు. అది పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందా? పొందితే తదుపరి కమ్యూనిస్టుల మీద నిషేధం విధిస్తారా ? ఏమైనా జరగొచ్చు!
కమ్యూనిస్టు సంబంధిత లేదా కమ్యూనిస్టు నేతల పేర్లతో ఉన్న బహిరంగ స్ధలాలు, సంస్ధలు, కట్టడాల పేర్లు కూడా మార్చాలని బ్రెజిల్‌ పాలకులు ఆలోచిస్తున్నారు. పాలకపక్ష చర్యను బ్రెజిల్‌ కమ్యూనిస్టు యువజన సంఘం ఖండించింది. గతంలో నిరంకుశ పాలకులు ఇదే విధంగా తమ సంస్ధను, కమ్యూనిస్టు పార్టీని పని చేయనివ్వకుండా చేశారని తిరిగి అదే చర్యకు ఒడిగట్టారని పేర్కొన్నది. తూర్పు ఐరోపాలోని పోలాండ్‌, హంగరీ వంటి దేశాలలో చేస్తున్న మాదిరే ఇక్కడ కూడా చేస్తున్నారని పేర్కొన్నది. కమ్యూనిజం-నాజీయిజాలను ఒకే గాటన కడుతున్న ఐరోపా యూనియన్‌ వైఖరినే బ్రెజిల్‌ పాలకులు అనుసరిస్తున్నారని...ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప వేరు కాదని విమర్శించింది.
ఉక్రెయిన్‌, మరికొన్ని తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అధికారానికి వచ్చిన నియంతలు, ఫాసిస్టు శక్తులు కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించారు. కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు పెట్టారు. తాను ఉక్రెయిన్‌ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించాలని బిల్లును ప్రతిపాదించినట్లు ఎడ్వర్డ్‌ బోల్జానో చెప్పాడు. బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూ నిస్టు పార్టీ (పిసిడిఓబి)కి ఎనిమిది మంది సభ్యులున్నారు, 27కు గాను ఒక రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది. అనేక మున్సిపల్‌, కార్పొరేషన్లలో పార్టీ అధికారంలో ఉంది. 'కమ్యూనిస్టు చిహ్నాల బిల్లు'కు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తరువాత కమ్యూనిస్టు, ఇతర పురోగామి శక్తుల కార్యకలాపాలను నిషేధించినా ఆశ్చర్యం లేదు. కరోనా వైరస్‌ నివారణలో వైఫల్యం, కార్మికుల హక్కులపై దాడి, ఆర్థిక రంగంలో తిరోగమనం వంటి సమస్యలతో బోల్సనారో ప్రభుత్వం నానాటికీ ప్రజా వ్యతిరేకంగా మారుతున్నది. కమ్యూనిస్టు పార్టీ ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది. ఇది కూడా ఆ బిల్లు ప్రతిపాదనకు ఒక కారణంగా చూడవచ్చు.
విదేశాంగ విధానంలో లాటిన్‌ అమెరికన్‌ దేశాల ఐక్యత, రక్షణ అనే వైఖరికి బ్రెజిల్‌ దూరం అవుతున్నది. అంతర్జాతీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగం రూపొందించిన విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నది. పైగా, ఇటీవలి కాలంలో ఐరోపా, అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నాయి. అనేక దేశాల్లో మితవాద శక్తుల పట్టు పెరుగుతోంది. గతేడాది సెప్టెంబరులో ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించటాన్ని చూస్తే ఒక వ్యవస్ధగానే కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది.
అమెరికా ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపథ్యంలో బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించాలనే బిల్లు ప్రతిపాదనను చూడాల్సి ఉంది. అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బిడెన్‌, కమలా హారిస్‌ ఎన్నికైతే అమెరికా కమ్యూనిజం వైపుకు పోయినట్లేనని గత పది రోజులుగా రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ వంటి డెమోక్రటిక్‌ సోషలిజం గురించి మాట్లాడేవారు, ఎలిజబెత్‌ వారెన్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌, కమలా హారిస్‌ వంటి ఉదారవాదులను కమ్యూనిస్టులుగా చిత్రించి రిపబ్లికన్‌ పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్న అమెరికన్ల ఓట్ల కోసం నానా పాట్లూ పడుతున్నది. మన దేశంలో ఇందిరా గాంధీని కూడా సోషలిస్టుగా పశ్చిమ దేశాల మీడియా చిత్రించిన విషయం తెలిసిందే. అందువలన వారి పరిభాషలో సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా చిత్రించిన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కొన్ని అంశాలలో మితవాదులతో విబేధించే పరిమిత పురోగామి భావాలు కలిగిన వారిగానే చూడాల్సి ఉంది.
ఐరోపా లేదా బ్రెజిల్‌ మరొక దేశంలో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించినంత మాత్రాన, వాటిని వినియోగించే పార్టీలను ఎన్నికలకు దూరం చేసినంతనే పురోగామి శక్తుల రధచక్రాలు ఆగిపోతాయనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి ఉండదు. మహత్తర తెలంగాణ సాయుధ పోరాట ప్రారంభంలో వడిసెలతో శత్రువులను ఎదుర్కొన్న యోధులకు తుపాకులు సమకూర్చు కోవటం పెద్ద సమస్యగా మారలేదు. శిక్షణ పొందిన మిలిటరీతో సమంగా...ప్రాథమిక పరిజ్ఞానంతో తుపాకులు పేల్చిన సామాన్యులు...కిరాయి మూకలు, సైన్యాన్ని ఎలా ఎదిరించారో చూశాము. అవసరాలు అన్నింటినీ సంపాదించుకొనే మార్గాలను కూడా చూపుతాయి.
బ్రెజిల్‌, ఇండోనేషియా, ఐరోపా మరొక చోట ఎక్కడైనా దోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకోవాలనే నిశ్చయానికి కార్మికవర్గం, రైతులు రావాలే గాని... సుత్తి, కొడవలి, నక్షత్రం, ఎర్రజెండా కాకపోతే మరో గుర్తులు, పతాకంతో సంఘటితం అవుతారు. లాటిన్‌ అమెరికా, ఐరోపా, ఆసియా లోని కొన్ని దేశాలలో విప్లవాన్ని సాధించిన పార్టీలన్నీ తొలుత కార్మిక లేదా మరొక పేరుతో ప్రారంభమయ్యాయి తప్ప కమ్యూనిస్టు పార్టీలుగా కాదు. వియత్నాం కమ్యూనిస్టు నేత హోచిమిన్‌ 'వియత్నాం వర్కర్స్‌ పార్టీ' ప్రథమ కార్యదర్శిగా పని చేశారు. క్యూబాలో ఫైడల్‌ క్యాస్ట్రో తొలుత 'క్యూబా ప్రజా పార్టీ'లో చేరారు. వివిధ ఉద్యమాల పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు. 'పాపులర్‌ సోషలిస్టు పార్టీ' పేరుతో ఉన్న కమ్యూనిస్టులతో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకున్నారు తప్ప బహిరంగంగా పార్టీతో కలవలేదు. కమ్యూనిస్టుల గురించి జరిగిన తప్పుడు ప్రచార నేపథ్యంలో నియంతలను వ్యతిరేకించే వారిని సమీకరించేందుకు ఆ పని చేశారు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత తాను కమ్యూనిస్టునని క్యాస్ట్రో ప్రకటించారు. కమ్యూనిస్టుల మీద నిషేధం విధించిన పూర్వ రంగంలో కమ్యూనిస్టులు వివిధ దేశాలలో అనేక మారు పేర్లతో పని చేశారు. పార్టీ చిహ్నాలు, జెండాలు వేరుగావచ్చు, అధికారాన్ని శ్రామికవర్గ రాజ్య నిర్మాణానికి ఉపయోగిస్తున్నాయా లేదా అన్నదే గీటు రాయి.