Sep 30,2023 17:51

ప్రజాశక్తి-ఢిల్లీ : నారా లోకేష్ కు నోటీసులు ఏపీ సిఐడి అధికారులు జారీచేశారు. ఈరోజు ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేష్ కు సిఐడి అధికారులు స్వయంగా నోటిసులు ఇచ్చినట్లు  మీడియాకు తెలిపారు. ఏ కేసులో నోటీసులు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 41ఏ కింద లోకేష్ కు నోటీసులు ఇచ్చినట్లు ఏపీ సిఐడి అధికారులు తెలిపారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు తాడేపల్లి సిఐడి కార్యాలయంలో హాజరుకావాలని తెలిపారు. వాట్సాప్ లో నోటీసులు పంపారు కదా.. మళ్లీ ఎందుకు వచ్చారని అధికారులను లోకేష్ ప్రశ్నించారు. 41-3, 41-4 సెక్షన్ల గురించి వివరించాలని లోకేష్ కోరగా, సిఐడి అధికారులు వివరించారు. సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయనని లోకేష్ పేర్కొన్నారు. నోటిసులు క్షుణ్ణంగా చదువుకొని, విచారణకు హాజరు అవుతానాని లోకేష్ తెలిపారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ఏ14గా ఉన్నారని విషయం విదితమే.