రాష్ట్ర ప్రభుత్వ రికార్డులలో అంగన్‌వాడి, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యో గులుగా చూయించటం, ఆచరణలో మాత్రం కనీసం వర్కర్లుగా కూడా గుర్తించకపోవటం అంటే వీరిని దారుణంగా మోసగించటమే. లెక్కకు వీరు ప్రభుత్వ ఉద్యోగులు. చెల్లించేది మాత్రం గౌరవ వేతనం. ఆ సాకుతో చిరుద్యోగులు, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ఆశా, అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలను దూరం చేస్తున్నది. అర్హులైన అంగన్‌వాడీలకు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని 1996 లోనే ప్రభుత్వం జీఓ ఇచ్చినా నేటికీ అమలు జరగలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అందని ద్రాక్ష లాగా మారాయి. సచివాలయాల వేదికగా దరఖాస్తుల ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపికలు జరుగుతున్నాయి. ఇళ్ల స్థలాలు, చేయూత లాంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవటానికి అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు అనుమతి ఇవ్వటం లేదు. కుటుంబాలలో ఆటో కార్మికులు, టైలర్లు ఉంటే ప్రభుత్వ ఆర్థిక సాయం అందటంలేదు. భర్త చనిపోయాక కుటుంబ భారం మోస్తున్న వారికి సైతం వితంతు పెన్షన్ ఎత్తివేశారు. కుటుంబంలో వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ నిలిపివేశారు. సంక్షేమానికి అర్హులైన వారిని దూరం చేయటాన్ని చూస్తే పేద మహిళలు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లం అవుతుంది.
రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వకుండా బతికేదెలా?
ప్రభుత్వం వెబ్‌సైట్లలో వీరిని ఉద్యోగులుగా చూపిస్తోంది. కానీ కార్మికులుగా కూడా గుర్తించడం లేదు. పైగా, 60 ఏళ్లు నిండాయనే సాకుతో బలవంతంగా రిటైర్ చేస్తున్నది. చట్టబద్ధ సౌకర్యాలు అమలవుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సైతం రిటైర్మెంట్ తరువాత, పెద్ద మొత్తంలో పెన్షన్ పొందుతూ మరలా అదే ఆఫీసులో కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం పెన్షన్‌తో పాటు, జీతం కూడా చెల్లిస్తున్నది. కానీ అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు మాత్రం ఇతర ఆదాయాలు వచ్చే ఏ పని చేయకూడదని షరతులు విధించింది. అమ్మ పెట్టా పెట్టదు-అడుక్కు తిననివ్వదు అన్న చందంగా ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వదు. చట్టబద్ధ సౌకర్యాలు కల్పించదు. దాంతో వారు అరకొర వేతనాలతో బతుకులీడుస్తున్నారు. అందులో మహిళలు చేసే పనికి చెల్లించే కొద్దిపాటి వేతనాలను కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటూ వారిని ఉద్ధరిస్తున్నట్లు ప్రభు త్వాలు ఫోజులు పెడుతున్నాయి. ఆశా వర్కర్లు భర్త పెన్షన్ తీసు కుంటున్నారనే కారణంతో విధుల నుండి తొలగిస్తు న్నారు. 60 సంవత్సరాలు దాటాయని ఆశాలకు ఎటువంటి బెనిఫిట్లు కల్పించకుండానే శాలువా కప్పి ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తున్నారు. 45 ఏళ్లగా పని చేస్తున్న అంగన్‌వాడీలను రిటైర్ చేసి వర్కర్లకు రూ.50 వేలు, హెల్పర్లకు రూ.30 వేలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. చిరుద్యోగులయిన అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు జీవిత చరమాంకంలో బతకటానికి అవసరమయిన రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించకపోతే ఎలా బతకాలి? అందుకే అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు రూ.3 లక్షలు, రిటైర్మెంట్ సందర్భంగా ఎక్స్‌గ్రేషియా, వేతనంలో సగం పెన్షన్, ఆశా వర్కర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించిన తరువాతే రిటైర్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని రికార్డుల నుండి తొలగించి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం జరుగుతున్న పోరాటానికి...వీరి సేవలందు కుంటున్న లబ్ధిదారులు, స్కీం వర్కర్లు, కార్మికులు మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- కె. ధనలక్ష్మి, శ్రామిక మహిళా రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్










