కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను నిరసిస్తూ శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికార ఎన్‌డిఎ నుంచి శనివారం నిష్క్రమించింది. వారం క్రితం మోడీ సర్కారు పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టిన నాడే కేంద్ర కేబినెట్‌లో కొనసాగుతున్న దళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొనసాగింపుగా ఎన్‌డిఎ నుంచి దళ్ వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. రెండున్నర దశాబ్దాలుగా ఎన్‌డిఎ మిత్రపక్షంగా ఉన్న దళ్ తమ బంధాన్ని తెగతెంపులు చేసుకోడానికి వ్యవసాయ బిల్లులు ఒక ప్రధాన హేతువే అయినా, స్నేహాన్ని తుంచుకోవడానికి పలు రాజకీయ పర్యవసానాలూ ప్రముఖంగా ప్రభావితం చేశాయి. పంజాబ్‌లో బిజెపి చేపట్టిన రెండు ముక్కలాట, మతోన్మాద చర్యలు దళ్ ప్రాభవాన్ని ఒక పథకం ప్రకారం దెబ్బ తీసేలా పరిణమించాయి. సదరు బిజెపి కుటిల పన్నాగాల ఫలితమే తెగతెంపులు. పంజాబ్ పూర్తి వ్యవసాయక రాష్ట్రం. అంతేకాదు, దేశ ప్రజల ఆహార భద్రతకు పంజాబ్ వెన్నుదన్నుగా నిలిచింది. బిజెపి చేపట్టిన వ్యవసాయ సంస్కరణల ప్రభావం తొలుత పడేది పంజాబ్ రైతాంగం పైనే. ఇప్పటికే రైతులు రోడ్డెక్కారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ రైతు ఉద్యమాల్లో మమేకమైంది. ఈ సమయంలో బిజెపితో అంటకాగితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో, రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు దళ్ తప్పని పరిస్థితుల్లో ఎన్‌డిఎ నుంచి వైదొలిగిందన్నది ఒక వాస్తవం. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రం పంజాబ్ పలు ప్రజా, మితవాద ఉద్యమాలకు నెలవు. ఇంతటి సున్నిత రాష్ట్రంలో ఉనికి కోసం బిజెపి తన 'సహజ' సిద్ధాంతానికి పదును పెడుతోంది. ఇది కూడా ఎన్‌డిఎ నుంచి దళ్ వీడటానికి కారణం.
ఎన్‌డిఎ మిత్రపక్షంగా కొనసాగుతూ 2019 సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న దళ్‌కు కేవలం రెండు లోక్‌సభ సీట్లే లభించాయి. అనంతరం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14 స్థానాలే ఆ పార్టీకి వచ్చాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఇదే సమయంలో మోడీ తన కేబినెట్‌లో దళ్‌కు బెర్త్ కల్పిస్తూనే, పంజాబ్‌లో ఆ పార్టీ చీలికకు పావులు కదిపింది. వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఎస్.ఎస్.ధిన్డ్‌శా కు పద్మవిభూషణ్ పురస్కారం కల్పించి దళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌కు షాక్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా ధిన్డ్‌శా ను ప్రయోగించి దళ్‌ను చీల్చి శిరోమణి అకాలీదళ్ (తక్‌సాల్) పేర వేరుకుంపటి పెట్టించింది. బాదల్ వ్యతిరేకులందరూ తక్‌సాల్ పార్టీలో చేరేలా కుటిల రాజకీయాలు నడుపుతోంది. పంజాబ్‌లో దళ్ దూరమైనా మరో ప్రాంతీయ పార్టీ తక్‌సాల్‌ను రిజర్వ్ చేసుకుంది. మరో వైపు ఆర్‌ఎస్‌ఎస్ తనకు అనుబంధంగా రాష్ట్రీయ శిఖ్ సంఘటన్‌ను నెలకొల్పి మతోన్మాదాన్ని నూరిపోస్తోంది. పొమ్మనకుండా పొగబెట్టిన బిజెపి కుట్ర రాజకీయాలతోనే దళ్ దూరం జరిగిందన్నది ఒక యథార్థం.
చారిత్రకంగా దేశంలో కాంగ్రెస్ తర్వాతి పురాతన పార్టీ అకాలీదళ్. దేశ విభజనను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఉద్యమించింది. స్వాతంత్య్రం వచ్చాక పంజాబీ భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడింది. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని ఆ పార్టీ నాయకత్వం మొత్తం జైలు పాలైంది. మత పార్టీగా అవతరించిన పార్టీ 1996లో మోగా కాన్ఫరెన్స్‌లో సెక్యులర్ పార్టీ లైన్ తీసుకుంది. సెక్యులర్ అంటూనే బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ లో చేరి కేంద్రంలో పదవులూ తీసుకుంది. బిజెపి తీసుకున్న 'విభజించు పాలించు విధానం' తన ఉనికికే ప్రమాదమని ఇప్పటికి తెలుసుకుంది. బిజెపి అనుసరిస్తున్న విధానాలకు మద్దతిస్తే ప్రజాగ్రహం పెల్లుబికి తన పుట్టి మునగడం ఖాయమని గుర్తించినట్టుంది. చాలా ప్రాంతీయ పార్టీలు ఒక్కో చారిత్రక సందర్భంలో ఒక సిద్ధాంతం ఆధారంగా పురుడు పోసుకున్నా, తదనంతర పరిణామాల్లో ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే పెద్ద పీట వేసి, అసలు సిద్ధాంతానికి తిలోదకాలివ్వడం పరిపాటి. మోడీ ప్రధాని అయ్యాక, 'చాప కింద నీరు' రాజకీయాలను వ్యతిరేకిస్తూ శివసేన, టిడిపి (ప్రస్తుతం పార్లమెంట్‌లో మద్దతు), బీహార్ లో ఆర్‌ఎల్‌ఎస్‌పి ఎన్‌డిఎ నుంచి వైదొలిగాయి. ఇప్పుడు దళ్ వంతు వచ్చింది. హర్యానా బిజెపి ప్రభుత్వంలో ఉన్న జెజెపి అదే బాటలో పయనిస్తోంది. బిజెపితో నెయ్యం ధృతరాష్ట్ర కౌగిలి వంటిదని మిగతా ఎన్‌డిఎ పార్టీలు, అవసరాల కోసం లోపాయికారిగా మద్దతిచ్చేవారు గ్రహించడం మంచిది.










