- బోణీ కొట్టిన విజయనగరం రాయల్స్, బెజవాడ బ్లేజర్స్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్:విజయనగరం సమీపంలోని చింతవలసలో పివిజి రాజు క్రికెట్ అకాడమీలో ఎసిఎ ఉమెన్ టి20 క్రికెట్ లీగ్ ఆదివారం ఉత్సాహ పూరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ క్వీన్స్‌పై బెజవాడ బ్లేజర్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెజవాడ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. రాయలసీమ క్వీన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెజవాడ జట్టులో వాసవి అఖిల్ పావని నాలుగు వికెట్లు పడగొట్టింది. మధ్యాహ్నం విజయనగరం రాయల్స్, వైజాగ్ డాల్ఫిన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వైజాగ్ డాల్ఫిన్స్ జట్టు 12.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. మ్యాచ్ మధ్యలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం... విజయనగరం రాయల్స్ జట్టు 12 ఓవర్లలో 85 పరుగులు చేసి విజయం సాధితంచింది. మ్యాచ్‌కు ముఖ్యఅతిథులుగా ఎసిఎ సిఇఒ శివారెడ్డి, సహాయ కార్యదర్శి ఎ.రమేష్, విజయనగరం జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ఎన్ రాజు, ఎసిఎ మేనేజర్ డి.నాగేశ్వరరాజు, నార్త్ జోన్ అకాడమీ చైర్మన్ జివిఎస్‌ఎన్ రాజు, నార్త్ జోన్ కన్వీనర్ పివి దేవవర్మ, బ్రాండ్ అంబాసిడర్ రష్మి గౌతమ్ హాజరయ్యారు.










