- హోరాహోరీ పోరులో ఆరు వికెట్ల తేడాతో వైజాగ్‌పై గెలుపు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్:ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల టి20 కప్ రెండో సీజన్ విజేతగా విజయనగరం రాయల్స్ జట్టు నిలిచింది. విజయనగరంలోని చింతలవలస వద్ద డాక్టర్ పివిజి రాజు ఎసిఎా నార్త్ జోన్ క్రికెట్ అకాడమీ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయనగరం రాయల్స్ జట్టు.. వైజాగ్ డాల్ఫిన్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌కు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో టాస్ వేశారు. టాస్ గెలిచిన వైజాగ్ డాల్ఫిన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. హిమబిందు 44, రంగలక్ష్మి 31 పరుగులు చేశారు. విజయనగరం జట్టుకు చెందిన సరయూ 29 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశారు.
134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన విజయనగరం రాయల్స్ జట్టు 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో దేవిక 45, విన్ని సుజాన్ 29, పద్మజ 24 పరుగులు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. విజేతలకు ఆంధ్ర మహిళల క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్ రష్మి గౌతమ్, విజయనగరం జడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, టోర్నమెంట్ స్పాన్సర్ హనీ గ్రూప్ చైర్మన్ ఓబుల్ రెడ్డి తదితరులు ట్రోఫీ, నగదు బహుమతిని అందజేశారు. విజేతగా నిలిచిన విజయనగరం రాయల్స్ జట్టుకు రూ.6 లక్షలు, రన్నరప్‌గా నిలిచిన వైజాగ్ డాల్ఫిన్స్ జట్టుకు రూ.4 లక్షలు నగదు బహుమతి అందించారు. ఫైనల్ మ్యాచ్‌లో స్వార్డ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విజయనగరం రాయల్స్ క్రీడాకారిణి విన్నీ సుజాన్, స్వార్డ్ సూపర్ బౌలర్ ఆఫ్ ది మ్యాచ్‌గా పి.సరయు, హానీ గ్రూప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా విజయనగరం రాయల్స్‌కు చెందిన కె.దేవిక ఎంపికయ్యారు.










