Jun 11,2023 07:57
  • టీమిండియా లక్ష్యం 444, ప్రస్తుతం 164/3

లండన్‌ : ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్‌ ఛాంపి యన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్‌ రసకందాయంలో పడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 444పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 164పరుగులు చేసింది. కోహ్లి(44), రహానే(20) క్రీజ్‌లో ఉన్నారు. చివరిరోజు మరో 280 పరుగులు చేస్తే టీమిండియా, మరో ఏడు వికెట్లు కూలిస్తే తొలిసారి డబ్ల్యుటిసి టైటిల్‌ను చేజిక్కించుకోనున్నాయి.
           ఓవర్‌నైట్‌ స్కోర్‌ 4వికెట్ల నష్టానికి 123 పరుగులతో శనివారం నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 270పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. 167 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మిచెల్‌ స్టార్క్‌(41), అలెక్స్‌ క్యారీ(66నాటౌట్‌) ఆదుకున్నారు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగారు. లబూషేన్‌ (41), కామెరూన్‌ గ్రీన్‌ (25) త్వరగా ఔటయ్యారు. ప్యాట్‌ కమిన్స్‌(7) ఔటయ్యాక ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. జడేజాకు మూడు, షమీ, ఉమేశ్‌కు రెండేసి, సిరాజ్‌కు ఓ వికెట్‌ దక్కింది.
 

                                                         అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి శుభ్‌మన్‌ ఔట్‌..

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(18) బలయ్యాడు. బోలాండ్‌ వేసిన 8వ ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి స్లిప్‌ ఫీల్డర్‌ కామెరూన్‌ గ్రీన్‌ డైవ్‌తో సింగిల్‌ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు తేలింది. దాంతో ఫీల్డ్‌ అంపైర్‌.. థర్డ్‌ అంపైర్‌ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో పరిశీలించి ఔట్‌గా ప్రకటించాడు.