- గతంలో మట్టి నీరుతో సరిపెట్టిన మోడీ
- రాజధానిని పట్టించుకోని కేంద్రం
- రైల్వేజోన్, స్టీలు ఫ్యాక్టరీ, పోర్టుల పరిస్థితి అంతంతే
- విభజన హామీల అమల్లో నిర్లక్ష్యం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పునిర్వభజన తరువాత మూడోసారి రాష్ట్రానికి వస్తున్న మోడీ విభజన హామీల అమలుపై ఈసారైనా నోరెత్తుతారా లేదా అమరావతికి వచ్చిన మట్టి, నీరు మాదిరే వెళ్లిపోతారా అనేది రాష్ట్ర ప్రజల్లో సందేహంగా మారింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, అమరావతి నిర్మాణం, విశాఖ రైల్వేజోన్, దుగరాజటప్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు ఇవన్నీ కూడా విభజన హామీలుగానే మిగిలిపోయాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అంతో ఇంతో ఇస్తున్నా కీలకమైన పునరావాసంపై కేంద్రం నోరెత్తడం లేదు. దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో సోమవరం రాష్ట్రానికి వస్తున్న మోడీ వీటిపై నోరెత్తుతారా లేదా అనేది సందేహంగా మారింది. విభజన ప్రకారం ఆర్థికంగా నష్టపోయిన ఎపికి రూ.16 వేల కోట్ల లోటు ఉందని, దీన్ని పూడుస్తామిన ప్రతిపక్షంలో ఉండగా బిజెపి నాయకత్వం హామీనిచ్చినా అధికారంలోకి వచ్చాక లోటు లేదని, నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెత్తులేత్తేసింది. దీనిపైనా రాష్ట్రంలో ఉన్న అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నోరెత్తడం లేదు. వినతిపత్రాలో సరిపెడుతున్నాయి. కీలకమైన అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. శంకుస్థాపన సమయంలో ఇక్కడకు వచ్చి మట్టి, నీరు ఇచ్చి వెళ్లిన ప్రధాని మోడీ అనంతరం తిరుపతి ఎన్నికల సభలో పాల్గొనేందుకు వచ్చారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మరోసారి ఎపికి వస్తున్నారు. గతంలో రెండుసార్లు విభజన హామీలపై ప్రధాని స్పందించలేదు. వాస్తవంగా విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. దానిపై బిజెపి నాయకులుగానీ, కేంద్రంగానీ నోరెత్తలేదు. రాష్ట్ర ప్రభుత్వమూ గట్టిగా అడగటం లేదు. విజయవాడ, గుంటూరుతో కలిపి రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది.
రాజధాని నిర్మాణంపై డిపిఆర్ పంపించాలని కేంద్రం కోరగా అప్పటి టిడిపి ప్రభుత్వం సుమారు రూ.1.09 లక్షల కోట్లు ఖర్చవుతుందని, మౌలిక సదుపాయాలకు ఎకరానికి కోటి రూపాయల చొప్పున వేసుకున్నా రూ.46 వేల కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించి పంపించింది. ఇప్పటి వరకూ దానిపై అతీగతి లేదు. విశాఖపట్నం రైల్వేజోన్ ఇస్తామని చెప్పినా ఇంతవరకు పూర్తిస్థాయిలో తేల్చలేదు. బయట ఒకమాట, పార్లమెంటులో మరొకమాట చెబుతూ ప్రజలను తీవ్ర గందరగోళంలో పడేస్తున్నారు. దేశానికి వజ్రాభరణంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం సిద్ధమైన నేపథ్యంలో అక్కడి ఉద్యోగులు, విశాఖవాసులు ఏడాదికిపైబడి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కేంద్రంలో స్పందన లేదు. పైగా అమ్మకానికి నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇస్తోంది. కడప స్టీలు ప్లాంటులోనూ పురోగతి లేదు. డిపిఆర్ దగ్గరే అది నిలిచిపోయింది. గిరిజన ప్రాంతాల్లో విపరీతంగా మైనింగ్ జరుగుతోంది. ఆర్‌ఓఎఫ్‌ఆర్ హక్కులను కాలరాస్తున్నా కేంద్రం స్పందించడం లేదు. కేంద్ర విద్యాసంస్థల అభివృద్ధి లేదు. కొన్ని ఏర్పాటు చేసినా ఇప్పటికీ ప్రైవేటు కళాశాలల్లోనూ, భవనాల్లోనూ నడుస్తున్నాయి. అరకొరగా నిధులు ఇస్తోంది. మరీ ముఖ్యంగా పోర్టుల నిర్మాణం, విసిఐసి కారిడార్లలోనూ పురోగతి లేదు. వీటన్నిటిపై ఫ్రధాని స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.










