Mar 29,2023 16:22
  • ముంబయి హెడ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌
  • ఐపిఎల్‌కు బుమ్రా దూరం..

ముంబయి: రేపటినుంచి ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-16 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అత్యధికసార్లు టైటిల్‌ విజేత ముంబయి ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై భారం తగ్గిస్తామని, అవసరమైతే ఒకటి, రెండు మ్యాచ్‌లకు అతడికి విశ్రాంతినిస్తామని వెల్లడించాడు. స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ సీజన్‌ ఐపిఎల్‌కు దూరం కావడం లోటే అయినప్పటికీ.. మిగిలిన బౌలర్లంతా ఇటీవలికాలంలో అద్భుత ఫామ్‌లో ఉండడం తమకు కలిసి రానుందన్నాడు. ఐపిఎల్‌ ముగిసిన అనంతరం టీమిండియా ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్‌లో ఆడాల్సి ఉందని, ఈ క్రమంలో కెప్టెన్‌పై వర్క్‌లోడ్‌ తగ్గించమని మేనేజ్‌మెంట్‌ కోరిందని బౌచర్‌ వెల్లడించాడు. అలాగే డబ్యుటిసి ఫైనల్లో ఆడే ఆటగాళ్లంతా గాయాలబారిన పడకుండా జాగ్రత్తపడాలని సూచించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. బుమ్రా, శ్రేయస్‌ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు గాయాలబారిన పడి ఐపిఎల్‌కు దూరమయ్యారని, అంతర్జాతీయ క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకొని బిసిసిఐ కీలక ఆటగాళ్లందరి ప్రదర్శనను పరిశీలిస్తోందని అన్నాడు. రెండు నెలల తర్వాత టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీగా ఉందని, ఈ క్రమంలో ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరమెంతైనా ఉందని పేర్కొన్నాడు. టెస్ట్‌ ఫార్మాట్‌తో పోల్చిచూస్తే టి20 చాలా చిన్న గేమ్‌ మాత్రమేనని, టి20ల్లో 100శాతం ప్రదర్శనను కనబర్చాల్సి ఉంటుందన్నాడు.