Nov 02,2022 20:49
  • నియంత్రణకు ప్రభుత్వానికి వివరనిస్తాం
  • ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణ కట్టడి అంశంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంగీకరించారు. దీనిపై త్వరలోనే వివరణ ఇస్తూ ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. బుధవారం ముంబయిలో జరిగిన ఎఫ్‌ఐబిఎసి కాన్ఫరెన్స్‌లో బ్యాంకర్లతో దాస్‌ మాట్లాడారు. వరుసగా మూడు త్రైమాసికాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతానికి ఎగువన ఉండడానికి గల కారణాలపైనే నివేదికలో దష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం గురువారం ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భేటీ కానుందని వెల్లడించారు. అయితే అందులోని విషయాలను మాత్రం బయట పెట్టమని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవన్నారు. కానీ.. ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు మధ్య జరిగే సమాచార బదిలీని బహిర్గతం చేసేందుకు నిబంధనలు అంగీకరించవన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఎప్పటి వరకు కట్టడిలోకి వచ్చే అవకాశం ఉందో కూడా ప్రభుత్వానికి తెలుపుతామన్నారు. ధరల్ని అదుపు చేయడానికి తీసుకునే చర్యల విషయంలో తొందరపడి ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి ఉండేదన్నారు. ఇప్పటి వరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్‌బిఐ తీసుకున్న చర్యలు బాగానే ఉన్నాయని దాస్‌ సమర్థించుకున్నారు. దేశంలో ఓ దశలో ధరలు పెరుగుతున్న సమయంలోనూ.. వడ్డీ రేట్లను అలాగే కొనసాగించడం ద్వారానే ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచామన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఉంచగలిగామన్నారు. తొందరపడి ఆ సమయంలో వడ్డీ రేట్లు పెంచితే వ్యవస్థలకు నష్టం జరిగేదన్నారు. దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య కొనసాగించాలని ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. ఇది ఏడు శాతంగా ఎగువన నమోదవుతుంది. గడిచిన సెప్టెంబర్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 7.41 శాతానికి ఎగిసి ఐదు మాసాల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. అహార ద్రవ్యోల్బణం, ఇంధనం ధరలు ఎగిసిపడుతున్నాయి. వరుసగా తొమ్మిది మాసాలుగా ఆరు శాతం ఎగువన చోటు చేసుకుంటుంది.