- హైకోర్టులో ప్రారంభమైన విచారణ
- 18 తరువాతే ఎసిబికోర్టులో కస్టడి పిటిషన్‌పై వాదనలు
- కత్తియుద్దం తప్పదంటూ బాబు లాయర్ లూథ్రా ట్వీట్
- నా మిత్రుడు తప్పు చేయడు : రజనీకాంత్
ప్రజాశక్తి - యంత్రాంగం : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును సిఐడి అరెస్ట్ చేసి ఐదు రోజులు దాటుతున్నా ఆ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బుధవారం నాడు కూడా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ స్కామ్ కేంద్రంగానే రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు, కార్యకర్తల ఆందోళనలు కొనసాగాయి. అనేకచోట్ల టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేశారు. వైసిపి నాయకుల ప్రతి విమర్శలూ ఆగలేదు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరుసగా రెండవ రోజు కూడా దర్యాప్తుల పురోగతి, కోర్టుల్లో విచారణ జరుగుతున్న తీరు గురించి ఆరా తీసినట్లు తెలిసింది.
మరోవైపు రిమాండ్ పిటిషన్‌ను కొట్టి వేయాలంటూ చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. కౌంటర్ దాఖలకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరడంతో అంగీకరించిన న్యాయమూర్తి 18 వ తేది వరకు విచారణను వాయిదా వేశారు. అప్పటి వరకు కస్టడి పిటిషన్‌ను విచారించవద్దని ఎసిబి కోర్టును ఆదేశించారు. హైకోర్టులో విచారణ వాయిదా పడిన తరువాత చంద్రబాబు తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్ధ లూధ్రా గురుగోవింద్ సింగ్ సూక్తులను ప్రస్తావిస్తూ ' అన్ని ప్రయత్నాలు చేసినా...న్యాయం కనుచూపుమేరలో లేకపోతే కత్తిపట్టడమే సరైన పోరాటం' అంటూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్ చేసిన తరువాత రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో చంద్రబాబును ఆయన కలిశారు. మరోవైపు ప్రముఖ సినీ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేశ్‌ను ఫోన్‌లో పరమార్శించారు. 'చంద్రబాబు నా ఆత్మీయ మిత్రుడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు' అని రజనీకాంత్ అన్నట్లు టిడిపి వర్గాలు చెప్పాయి. బాబు హయంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే ఆయన్ను రక్షిస్తుందని, ధైర్యంగా ఉండాలని లోకేష్‌కు ఆయన చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి.










