May 07,2023 20:59

వెలిగొండ టన్నెల్‌లోని వరద నీటిని పరిశీలించిన మంత్రి సురేష్‌
ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా):
లిగొండ ప్రాజెక్టులోని టన్నెల్‌లోకి ప్రవేశించిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించి వెంటనే రెండో టన్నెల్‌ తవ్వకం పనులు ప్రారంభించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల్లోకి చేరిన వరద నీటిని అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. వరద నీరు వచ్చి చేరిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ వరుసగా నాలుగు రోజులు క్రితం నల్లమల అభయరణ్య ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల తీవ్రతకు వెలిగొండ హెడ్‌ రెగ్యులేటరీ పనులు జరుగుతున్న శ్రీశైలం ఎగువ ప్రాంతంలోని కొల్లంవాగు వద్ద వరద నీరు పోటెత్తిందని తెలిపారు. హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా మొదటి సొరంగంలోకి ప్రవేశించి కొత్తూరు వద్ద జరుగుతున్న సొరంగ నిర్మాణ ప్రాంతంలోకి భారీగా నీరు వచ్చి చేరిందన్నారు. దీంతో సొరంగ మార్గంలో విద్యుత్‌ ప్రసారం పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన రెండు రోజుల్లో తిరిగి విద్యుత్‌ను పునరుద్దరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి నాలుగు, ఐదు రోజుల్లోనే సొరంగం తవ్వకం పనులు ప్రారంభిస్తారని చెప్పారు. వెలుగొండ సొరంగం మార్గంలోకి వచ్చి చేరిన వరద నీటి విషయంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. తొందర్లోనే ఆయన కూడా వెలుగొండ ప్రాజెక్టు సొరంగ మార్గాన్ని పరిశీలిస్తారని చెప్పారు..