Apr 21,2023 08:55
  • పరిశ్రమల స్ధాపనతో ఉపాధి కల్పన
  • మార్కాపురం సభలో చంద్రబాబు హామీలు

ప్రజాశక్తి- మార్కాపురం : పశ్చిమ ప్రకాశం అత్యంత వెనుకబాటులో ఉన్నమాట వాస్తవమేనని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాబోతోందని, వెనుకబాటు తనాన్ని పొగొట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతాన్ని రాబోవు కాలంలో అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్‌వికెపి కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. 1996లో కరువును పారద్రోలేందుకు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అటవీ అనుమతులు కూడా తానే తెచ్చానని చెప్పారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చే సరికి 95 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిపోయిన ఐదు శాతం పనులను నాలుగేళ్లలో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. వెలిగొండ పూర్తి చేస్తే బాధ్యత తనదేనన్నారు. మార్కాపురాన్ని జిల్లాగా చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ సమస్యను అధిగమిస్తామని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 64 వేల కోట్లు ఖర్చు పెట్టి 24 ప్రాజెక్టులు పూర్తి చేశానని చెప్పారు. అమరావతి, పోలవరం, పరిశ్రమల ద్వారా ఎపిని 2029కి భారత దేశంలో నెంబర్‌ 1 రాష్ట్రంగా చేయాలని కల కన్నానన్నారు. కానీ 2019 నుంచి రాష్ట్రానికి సైతాన్‌ పట్టింది.... దీంతో రాష్ట్రం నాశనం అయ్యిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపిని చిత్తుగా ఓడించాలన్నారు.
 

                                                                    పేదలను కోటీశ్వరులను చేస్తా

పేద ప్రజలను కోటీశ్వరులను చేయడమే తన సంకల్పం అని మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా... ఏ రంగంలో ఉన్నా... నంబర్‌-1 స్థానంలో నిలవాలన్నది తొలి సంకల్పం అని, తెలుగు ప్రజల్లో ఉండే పేద తరగుతులందరూ కోటీశ్వరులు కావాలన్నది రెండో సంకల్పం అని వివరించారు. అనుభవం, విజన్‌, టెక్నాలజీ వాడుకోవడం, సంపన్నులు తోటి వారికి సాయం చేయడం, ప్రజల మద్దతుతో ఈ కలను సాకారం చేసుకోవచ్చని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఐడియాలజీ కాన్సెప్ట్‌ను చంద్రబాబు నాయుడు వేదికపై సాధారణ మహిళలు, పిల్లలతో కలిసి విడుదల చేశారు.
 

                                                               ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

చంద్రబాబునాయుడు 73వ పుట్టిన రోజు వేడుకలను మార్కాపురంలో జరుపుకున్నారు. మహిళలు, చిన్నారుల నడుమ 73 కిలోల కేక్‌ను చంద్రబాబు కట్‌ చేశారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చారు.