- మొదటి, రెండో టన్నెల్‌లో భారీగా చేరిన నీరు
- మునిగిపోయిన యంత్ర సామాగ్రి
- నిలిచిన ప్రాజెక్టు పనులు
ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా):ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలుగొండ ప్రాజెక్టు మొదటి, రెండో టన్నెల్‌లోకి భారీగా వరద నీరు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరడంతో రెండు టన్నెళ్లు నీట మునిగాయని వెలుగొండ ప్రాజెక్టు ఇఇ అబుత్ అలీమ్ తెలిపారు. మొదటి టన్నెల్‌లో ఆరు అడుగులు, రెండో టన్నెల్‌లో ఇరవై అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. దీంతో యంత్ర పరికరాలన్నీ నీటమునిగాయి. ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. వరద నీరంతా బయటకు తోడి తిరిగి పనులు ప్రారంభించాలంటే మరో పది రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని రైతు సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. టన్నెల్‌లో ఎక్కడో పెద్ద గండి పడి ఉంటుందని, దాని ద్వారానే భారీగా నీరు చేరిందని భావిస్తున్నారు. అధికారులు శాశ్వతమైన పనులు చేపట్టకపోవడంతోనే ఇలా జరిగి ఉంటుందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటరామిరెడ్డి విమర్శించారు. అక్టోబర్‌లో ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి నీరు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం వేసవిలో అరకొరగా కురిసిన వర్షానికే ప్రాజెక్టు నీట మునిగితే ఇక వర్షాకాలంలో ప్రాజెక్టు పరిస్ధితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని వీడనాడి మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అధికారులతో సమీక్షించిన మంత్రి సురేష్..
వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్లోకి నీరు చేరిన విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివఅద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ఎగువన ఉన్న కొల్లంవాగు వద్ద భారీగా కురిసిన వర్షానికి వరద నీరు టన్నెల్లోకి చేరిందన్నారు. వరద నీరు చేరికతో ప్రస్తుతం పనులు నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. తక్షణమే మోటార్లతో నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపట్టి నాలుగు రోజుల్లో తిరిగి పనులు ప్రారంభిస్తారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పనుల్లో జాప్యం జరగకూడదని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో ప్రాజెక్టును పరిశీలిస్తానని తెలిపారు.










