Dec 27,2022 08:41
  • మరొకరి పరిస్థితి ఆందోళనకరం

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ, పరవాడ, అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా పరవాడలోగల రామ్‌కీ ఫార్మా సిటీలోని లారస్‌ లేబ్‌ యూనిట్‌-3లో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొక కార్మికుని పరిస్థితి విషమంగా ఉంది. తోటి కార్మికుల కథనం ప్రకారం... కంపెనీలో ఉత్పత్తిలేని ఎస్‌ ఫంక్షనింగ్‌ బ్లాక్‌ను శుభ్రం చేస్తుండగా రియాక్టర్‌ కింద రబ్బర్‌కు మంటలు వ్యాపించాయి.
          ఆ సమయంలో అక్కడ పదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని గాజువాకలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మృతుల్లో పర్మినెంట్‌ కార్మికులు బి.రాంబాబు (32) (ఖమ్మం), టి.రాజేష్‌బాబు (36) (గుంటూరు), కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన ఆర్‌.రామకృష్ణ, చోడవరం మండలానికి చెందిన మజ్జి వెంకటరావు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన వై.సతీష్‌ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితిపై మంగళవారం ఉదయానికిగానీ స్పష్టత ఇవ్వలేమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అనకాపల్లి ఆర్‌డిఒ చిన్నికృష్ణ తెలిపారు.
 

                                     మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి : సిఐటియు

మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకరరావు, జి.కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి చొప్పున ఫార్మాలో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. తీవ్రంగా గాయపడిన కార్మికునికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారితోపాటు ఫార్మాసిటీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.