Jul 05,2022 07:54
  • పది మాసాల వ్యవధిలో 37 శాతం పెరిగాయి
  • పరిహారంలో 30 శాతానికిపైగా కోత

న్యూఢిల్లీ : మానవ హక్కుల ఉల్లంఘనల్లో మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గడచిన సంవత్సరం మొదటి పది మాసాల్లోనే దాదాపు 37 శాతం దాకా ఈ ఉల్లంఘనలు పెరిగాయి. ఒకవైపు హక్కుల ఉల్లంఘనలు పెద్దయెత్తున పెరుగుతుంటే, మరో వైపు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సిఫారసు చేసే పరిహార మొత్తం భారీగా తగ్గుతుండడం మరో ఆందోళనకరమైన అంశం. ఈ హక్కుల ఉల్లంఘనల్లో చాలావరకు బిజెపి పాలిత యుపి రాష్ట్రంలో చోటుచేసుకున్నవే. 2021-22 ఆర్థిక సంవత్సరం మరో నెల రోజుల్లో ముగుస్తుందనగా కంప్యూటర్‌లో నమోదయిన డేటా ప్రకారం పది మాసాల్లోనే 37 శాతం దాకా ఈ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి.
    ఇందుకు సంబంధించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) వార్షిక నివేదికలను 2019 నుంచి ప్రభుత్వం ప్రచురించడం ఆపేసింది. ఈ మూడు సంవత్సరాల మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన డేటాను సంవత్సరాల వారీగా కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ గత బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంటు ముందుంచింది. ఇవి అమాంతంగా పెరిగిపోవడానికి మానవ హక్కుల పరిరక్షణలో రాష్ట్రాల వైఫల్యమే కారణమని చెప్పింది. ఈ ఉల్లంఘనల తీవ్రత, వాటి స్వభావం తెలియాలంటే రాష్ట్రాల వారీ వివరాలను పరిశీలించాల్సి ఉంది. ఎన్‌హెచ్‌ఆర్‌సి వార్షిక నివేదికల్లోనే ఆ వివరాలు లభ్యమవుతాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా మాజీ ఎగ్జిక్యుటివ్‌ డైరక్టర్‌ అవినాష్‌ కుమార్‌ తెలిపారు.
    గత మూడేళ్లుగా ఎన్‌హెచ్‌ఆర్‌సి వార్షిక నివేదికలు ఎందుకు బయటపెట్టడం లేదని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు బదులిస్తూ, ఎన్‌హెచ్‌ఆర్‌సి సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి వీటిపై వివరణలు కోరే ప్రక్రియలోనే ఉంది. . 2019-20 సంవత్సరానికి ఎన్‌హెచ్‌ఆర్‌సి ఇచ్చిన వార్షిక నివేదికలో కొన్ని సిఫారసులు చేసింది. వాటిపై వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదిక( ఎటిఆర్‌) లు రావాల్సి ఉంది. అవి వచ్చాక పార్లమెంటు ముందు ఉంచుతామని మంత్రి సెలవిచ్చారు.
    మానవ హక్కుల కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తున్న మరో అంశం హక్కుల ఉల్లంఘనలు పెరుగుతుంటే, ఈ కేసులో బాధితులకు ఎన్‌హెచ్‌ఆర్‌సి సిఫార్సు చేసిన పరిహారం అంతకంతకూ తగ్గిపోతూ వస్తోంది. 2018-2019 మధ్యే 30 శాతం దాకా కోత పడిందని అవినాష్‌ కుమార్‌ పేర్కొన్నారు. 2021డిసెంబర్‌ లో రాజ్యసభకు మంత్రి తెలిపిన వివరాల ప్రకారం 2018-2019లో 713 కేసుల్లో రూ. 27,67,54,996., 2019-2020లో 488 కేసులకు రూ. 15,06,85,840 పరిహారంగా చెల్లించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి సిఫారసు చేసింది.
మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతుంటే ఎన్‌హెచ్‌ఆర్‌సి దానిని ఏమీ గుర్తించినట్లుగా కనపడడం లేదు. ప్రభుత్వం మానవ హక్కుల కార్యకర్తలను వెంటాడి వేధిస్తున్నా, జైళ్లలో రాజకీయ ఖైదీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను సైతం అది పెడ చెవినపెడుతున్నది.
గత నెల 25న ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేయడం పట్ల అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ప్రత్యేక ప్రతినిధి మేరీ లావ్లల్‌ ''తీవ్ర ఆందోళన'' వ్యక్తం చేశారు. విద్వేషం, వివక్షకు వ్యతిరేకంగా, మానవ హక్కుల పరిరక్షణకు పోరాడడమే ఆమె చేసిన నేరమా అని ప్రశ్నించారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని, హక్కుల కార్యకర్తలపై వేధింపులకు స్వస్తి పలకాలని ఐరాస మానవ హక్కుల ప్రతినిధి కోరారు. భారత దేశంలో మానవ హక్కుల పరిస్థితి దారుణంగా ఉందని ఐరాస మానవ హక్కుల సంస్థకు చెందిన వర్కింగ్‌ గ్రూపు వ్యాఖ్యానించింది. యుఎపిఏ, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం, పిడియాక్టును ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తుంటే వాటిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఐరాస మానవ హక్కుల సంస్థ పేర్కొంది. మరణ శిక్ష రద్దు గురించి పట్టించుకోదు. హక్కుల కార్యకర్తలను వేధిస్తున్నా పట్టించుకోదు, విద్వేష నేరాలను అడ్డుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. జాతీయ మానవ హక్కుల సంఘం తీరే ఇలా ఉంటే ఇక మానవ హక్కులకు ఇక రక్షణ ఎక్కడుంటుందని ఐరాస మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

011